రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిన మారుతీ సుజుకి!

by Vinod kumar |
రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిన మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఆగష్టు నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో అమ్మకాలను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన హోల్‌సేల్ డేటాలో కంపెనీ మొత్తం 1,89,082 కార్లను విక్రయించినట్టు తెలిపింది. ఇప్పటివరకు కంపెనీకి ఒకనెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇదే కావడం గమనార్హం. గతేడాది ఇదే నెలలో మారుతీ సుజుకి 1,65,173 యూనిట్లతో పోలిస్తే ఈసారి 14 శాతం డీలర్లకు సరఫరా చేసింది. దేశీయ మార్కెట్లో మొత్తం 1,54,114 యూనిట్లను సరఫరా చేశామని, గతేడాది ఇది 16 శాతం ఎక్కువని కంపెనీ పేర్కొంది.

ఇందులో ఆల్టో, ఎస్-ప్రెసో లాంటి బడ్జెట్ కార్ల అమ్మకాలు 22,162 యూనిట్ల నుంచి 12,209 యూనిట్లకు క్షీణించగా, బలెనో, సెలెరియో, స్విఫ్ట్, ఇగ్నిస్, డిజర్ కార్లు 72,451 యూనిట్లతో స్వల్పంగా పెరిగాయి. యుటిలిటీ విభాగంలో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, జిమ్నీ అమ్మకాలు 58,746 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే 118 శాతం అధికం కావడం విశేషం. ఎగుమతులు 23 శాతం పెరిగి 26,932 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైన కారణంగా శుక్రవారం మారుతీ సుజుకి షేర్ ధర 3 శాతానికి పైగా పెరిగి రూ. 10,320 వద్ద ముగిసింది.

Advertisement

Next Story