151 శాతం పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు!

by Harish |   ( Updated:2023-05-08 11:21:18.0  )
151 శాతం పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లగ్జరీ ఇళ్లకు భారీ గిరాకీ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత విలాసవంతమైన గృహాలను ఇష్టపడే వారి సంఖ్య గణనీయంగా పెరగడం, ఎక్కువ స్థలం, మెరుగైన సౌకర్యాలతో కూడిన ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు లగ్జరీ హౌసింగ్ విభాగం వృద్ధికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తాజా 'ఇండియా మార్కెట్ మానిటర్-క్యూ1-2023' నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య లగ్జరీ ఇళ్లు గతేడాది కంటే 151 శాతం పెరిగాయని వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో లగ్జరీ(రూ. 4 కోట్లు అంతకంటే ఎక్కువ) ఇళ్ల అమ్మకాలు 216 శాతం పెరిగాయి. అలాగే, నగరాల్లో ప్రీమియం, హై-ఎండ్ విభాగం(రూ. 1-1.50 కోట్ల) ఇళ్లు ముంబైలో 44 శాతం, హైదరాబాద్‌లో సుమారు 800 శాతం, కోల్‌కతాలో 100 శాతం, పూణెలో 13 రెట్లు పెరిగాయి.

సమీక్షించిన కాలంలో అన్ని విభాగాల్లోనూ ఇళ్ల విక్రయాలు త్రైమాసిక పరంగా 12 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. ఈ జనవరి-మార్చి మధ్య 78 వేల హౌసింగ్ యూనిట్లు అమ్ముడవగా, అదే సమయంలో దాదాపు 81 వేల యూనిట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 49 శాతం ఇళ్లు మిడ్-ఎండ్ విభాగం ఇళ్లు ఉండగా, మిగిలినవి బడ్జెట్ ధరల ఇళ్లని నివేదిక వెల్లడించింది. రానున్న త్రైమాసికాల్లోనూ అమ్మకాల ధోరణి ఇదే స్థాయిలో కొనసాగుతుందని, మెరుగైన సౌకర్యాలతో కూడిన ఇళ్లు, ఆరోగ్యం, భద్రతపై ప్రజలు దృష్టి సారిస్తున్నారని సీబీఆర్ఈ ఛైర్మన్ అన్షుమాన్ మ్యాగజైన్ పేర్కొన్నారు.

Also Read..

మహిళలకు సూపర్ న్యూస్.. ఆ బ్యాంకుల నుంచి స్పెషల్ రుణాలు

Advertisement

Next Story

Most Viewed