50 వేల మార్కు దాటనున్న లగ్జరీ కార్ల విక్రయాలు: ఆడి ఇండియా హెడ్

by S Gopi |
50 వేల మార్కు దాటనున్న లగ్జరీ కార్ల విక్రయాలు: ఆడి ఇండియా హెడ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రీమియం వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది భారత లగ్జరీ మార్కెట్ మొదటిసారిగా 50,000 మార్కును అధిగమిస్తుందని ఆడియా ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ అన్నారు. గతేడాది ఈ విభాగం 28 శాతం వృద్ధితో 48,500 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ల మార్కెట్ ఒక ఏడాదిలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. గడిచిన దశాబ్దం కాలం నుంచి ఈ విభాగం అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. 'అమ్మకాలు దాదాపు 10 శాతం పెరిగినప్పటికీ, ప్రపంచ సరఫరాలో సమస్యలు ఉన్నప్పటికీ 2024లో లగ్జరీ మార్కెట్ 50 వేల మైలురాయిని దాటగలదనే విశ్వాసం ఉందని' బల్బీర్ సింగ్ తెలిపారు. 2022లో 4,187 యూనిట్లను విక్రయించిన ఆడి గతేడాది ఏకంగా 89 శాతం అధికంగా 7,931 యూనిట్ల రిటైల్ అమ్మకాలు సాధించింది. మరో ప్రీమియం బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా సైతం 15,822 యూనిట్ల నుంచి 10 శాతం పెరిగి 2023లో 17,408 యూనిట్లతో అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. బీఎండబ్ల్యూ 2023లో 14,172 యూనిట్లను విక్రయించింది. అయితే, సరఫరా సవాళ్ల కారణంగా ఈ ఏడాది వృద్ధి మరీ అధిక రెండంకెల వృద్ధి కాకపోయినా మోస్తరు పెరుగుదల ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మకాలు పెంచేందుకు తాము ప్రీ-ఓన్‌డ్ కార్ల వ్యాపారం కోసం మౌలిక ఏర్పాట్లను విస్తరించనున్నాం. గతేడాది 25 వరకు షోరూమ్‌లు ఉండగా ఈ ఏడాది దాన్ని 30కి చేర్చాలని లక్ష్యంతో ఉన్నామని బల్బీర్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story