భారత దుస్తుల ఎగుమతులను పెంచేందుకు కొత్త మార్కెట్లపై దృష్టి: ఏఈపీసీ!

by Disha News Web Desk |
భారత దుస్తుల ఎగుమతులను పెంచేందుకు కొత్త మార్కెట్లపై దృష్టి: ఏఈపీసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వస్త్రాల ఎగుమతి ప్రోత్సాహక సంఘం(ఏఈపీసీ) ఇకపై లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ లాంటి కొత్త మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంతో పాటు, 2022-23లో ముడిసరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ దేశీయ ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదు చేయవచ్చని ఏఈపీసీ అభిప్రాయపడింది. ఈ రంగానికి ఎగుమతి అవకాశాలను అన్వేషించేందుకు విదేశాల్లోని భారతీయ విభాగాలతో మెరుగైన సంబంధాలను కొనసాగిస్తోందని ఏఈపీసీ ఛైర్మన్ నరేంద్ర గోయెంకా చెప్పారు. తాము కొత్త మార్కెట్లలో విస్తరించాలని భావిస్తున్నాం. దేశీయంగా వస్త్ర పరిశ్రమ భారీ ఎగుమతుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2021-22 ముగిసే నాటికి పరిశ్రమ సుమారు రూ. 1.23 లక్షల కోట్లను, 2022-23లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను సాధించే అవకాశాలు ఉన్నాయి. దుస్తుల విభాగంలో గణనీయమైన వృద్ధిని కలిగి ఉన్నాం. బ్రాండ్ ఇండియా ఇమేజ్‌ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని నరేంద్ర గోయెంకా పేర్కొన్నారు. మానవ నిర్మిత ఫైబర్, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు పీఎల్ఐ పథకాల అమలుతో పెట్టుబడులకు వీలవుతుందని, ఇది దేశీయ తయారీ, ఎగుమతులకు సహాయపడుతుందని ఆయన వివరించారు. ఇదే సమయంలో ఈ రంగం ప్రస్తుతం ముడిసరుకు ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కొంటోందని, పత్తి నూలు ధర దాదాపు 70-80 శాతం పెరిగిందని పరిశ్రమ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడేందుకు ధరల నియంత్రణ అవసరమని పరిశ్రమ భావిస్తోంది.


Advertisement

Next Story