Intel lay off : ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన Intel.. 15 శాతం మంది తొలగింపు

by Harish |   ( Updated:2024-08-02 09:50:35.0  )
Intel lay off : ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన Intel.. 15 శాతం మంది తొలగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఖర్చు తగ్గింపులో భాగంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో ప్రపంచ టాప్ కంపెనీలు ఉండగా, తాజాగా సెమీకండక్టర్‌ దిగ్గజం ఇంటెల్ కూడా చేరింది. తన సంస్థలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 17,500 మందిపై ఈ తొలగింపు ప్రభావం పడింది. తన తయారీని పెంచుకోవడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగింపుల కారణంగా ఇంటెల్‌కు ఏటా 20 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతాయని అధికారులు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సమాచారం తెలియజేసినట్లు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో చెప్పారు.

ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ మాట్లాడుతూ, ఇంటెల్‌కి ఇది చాలా కష్టతరమైన రోజు, కంపెనీ చరిత్రలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి, డబ్బును ఆదా చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 2025 నాటికి కంపెనీ $10 బిలియన్ల పొదుపును సాధించాలని యోచిస్తోంది. అర్హతగల ఉద్యోగుల కోసం ఇంటెల్ మెరుగైన పదవీ విరమణ ఆఫర్‌ను ప్రకటించింది. వచ్చే వారం దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టనుంది.

ప్రస్తుతం మార్కెట్లో కృత్రిమ మేధ (AI) ఆధారిత చిప్‌ల ఉత్పత్తి బాగా పెరిగిపోయింది. దీంతో ఇంటెల్‌కు మార్కెట్లో గట్టి పోటీ మొదలైంది. అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజ్‌ల వంటి కంపెనీ ప్రత్యర్థులు ఈ రంగంలో మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నారు. ఎన్విడియా వంటి కంపెనీలు సెమీకండక్టర్‌ల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెల్ తన సాంకేతికతను మెరుగుపరచడం, సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీని అగ్రగామిగా మార్చడం లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధిపై భారీగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed