జనవరిలో 3 శాతం పెరిగిన భారత ఎగుమతులు

by S Gopi |
జనవరిలో 3 శాతం పెరిగిన భారత ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరిలో భారత ఎగుమతులు 3.1 శాతం పెరిగాయి. ఎర్ర సముద్రంలో హౌతీ దాడులతో రవాణా సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ఎగుమతులు పెరగడం గమనార్హం. దీంతో గత నెలలో భారత వాణిజ్య లోటు 17.49 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.46 లక్షల కోట్ల)కు తగ్గింది. ఇది గడిచిన తొమ్మిది నెలల్లోనే కనిష్టం. గురువారం విడుదల ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జనవరిలో సరుకుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 3.12 శాతం పెరిగి 36.92 బిలియన్ డాలర్లు(రూ. 3.06 లక్షల కోట్ల)కు చేరాయి. గతేడాది ఇదే నెలలో సరుకుల ఎగుమతులు 35.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు గతేడాది 52.83 బిలియన్ డాలర్ల(రూ. 4.38 లక్షల కోట్ల) నుంచి గత నెలలో 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లు(రూ. 4.52 లక్షల కోట్ల)కు చేరింది. సమీక్షించిన నెలలో సేవల ఎగుమతులు 32.80 బిలియన్ డాలర్లు(రూ. 2.72 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య భారత ఎగుమతులు 4.89 శాతం తగ్గాయి. దిగుమతులు 6.71 శాతం క్షీణించాయి. సమీక్షించిన కాలానికి వాణిజ్య లోటు 37.11 శాతం మెరుగుపడింది.

Advertisement

Next Story

Most Viewed