రెండు నెలల్లో ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఉక్కు దిగుమతులు

by Harish |   ( Updated:2024-06-12 09:05:23.0  )
రెండు నెలల్లో ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఉక్కు దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏప్రిల్‌తో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే దేశీయ డిమాండ్ కారణంగా ఉక్కు దిగుమతులు ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్‌లో గత కొంత కాలంగా నిర్మాణ రంగాల్లో వేగం పుంజుకోవడం, కొత్త ప్రాజెక్టులు రానుండటంతో ఉక్కుకు డిమాండ్‌ పెరిగింది. దీంతో అవరాల కోసం ఇతర దేశాలపై ఆధార పడక తప్పలేదు. భారత్ ఏప్రిల్-మే మధ్యకాలంలో 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ స్టీల్‌ను దిగుమతి చేసుకుంది, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 19.8 శాతం పెరగడం గమనార్హం.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారు అయిన భారతదేశంలో ఉక్కుకు బలమైన డిమాండ్ నెలకొంది. ఇటీవలి నెలల్లో దక్షిణ కొరియాతో పాటుగా చైనా భారతదేశానికి ఉక్కును ఎగుమతి చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే టాటా స్టీల్ వంటి ప్రధాన భారతీయ ఉక్కు ఉత్పత్తి దారులు చైనా దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశం నుంచి ఫినిష్డ్ స్టీల్ ఎగుమతులు కనీసం ఆరేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏప్రిల్-మే మధ్య ఉక్కు విదేశీ ఎగుమతులు 0.9 మిలియన్ టన్నులు, సంవత్సరానికి 39.6 శాతం తగ్గాయి. ముడి ఉక్కు ఉత్పత్తి దేశీయంగా 24.6 మిలియన్ టన్నులు, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 4.9 శాతం పెరిగింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, అధిక మౌలిక సదుపాయాల వ్యయం భారతదేశాన్ని ప్రపంచ ఉక్కు తయారీదారులకు లాభదాయకమైన మార్కెట్‌గా మార్చాయి, ముఖ్యంగా యూరప్,యునైటెడ్ స్టేట్స్‌లో ఉక్కు డిమాండ్ మందగించగా, భారత్‌లో మాత్రం డిమాండ్ నెలకొనడం ద్వారా ఇతర దేశాల ఉక్కు తయారీ కంపెనీల చూపు భారత్‌ వైపు పడింది.

Advertisement

Next Story

Most Viewed