Davos: దావోస్ సమావేశంలో ప్రాధాన్య దేశంగా భారత్

by S Gopi |
Davos: దావోస్ సమావేశంలో ప్రాధాన్య దేశంగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 55వ వార్షిక సమావేశంలో భారత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశంగా ఉండనుంది. ఎందుకంటే, ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దాదాపు 100 మంది సీఈఓలు, ప్రభుత్వం, పౌర సమాజం, కళారంగానికి చెందిన ప్రముఖులతో కూడిన అతిపెద్ద బృందాన్ని కేంద్ర ప్రభుత్వం దావోస్ సమావేశానికి పంపుతోంది. ఆర్థిక శక్తిగా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఎదుగుతున్న మన దేశ 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' భారత ప్రతినిధులు ప్రతిబింబించనున్నారు. భారత ప్రతినిధుల బృందానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వం వహించనున్నారు. దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్‌లో మనదేశ ఆలోచనా విధానం, ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధానం, డిజిటల్ పరివర్తన, డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారత్ కొత్త డిజిటల్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అశ్విని వైష్ణవ్‌తో పాటు ఇతర మంత్రులు సీఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, కె రామ్మోహన్ నాయుడు సహా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. యూరప్‌లోని ఎత్తైన పట్టణమైన దావోస్‌లో జరిగే ఈ సమావేశాలు జనవరి 14-30 మధ్య జరుగుతాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60 మంది అగ్ర రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమావేశం కోసం 5,000 మంది స్విస్ ఆర్మీ సిబ్బందిని మోహరించారు.

Next Story

Most Viewed