గత ఐదేళ్లలో భారత్‌కు రూ. 25 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!

by Disha Desk |
గత ఐదేళ్లలో భారత్‌కు రూ. 25 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్ల కాలంలో భారత్‌కు 339.55 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 25.41 లక్షల కోట్ల) విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ అన్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ నిధులు నిరంతరం పెరుగుతున్నాయని బుధవారం ఓ ప్రకటనలో చెప్పారు. 2014-15లో 45.15 బిలియన్ డాలర్ల(రూ. 3.37 లక్షల కోట్ల) ఎఫ్‌డీఐలు రాగా, 2020-21లో ఇది 81.97 బిలియన్ డాలర్ల(రూ. 6.13 లక్షల కోట్ల)కు పెరిగింది. 2019-20 లో భారత్ 74.39 బిలియన్ డాలర్ల(రూ. 5.56 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐలను నమోదు చేసింది. అంతకుముందు గణాంకాలను చూస్తే 2016-17లో 60.22 బిలియన్ డాలర్లు(రూ. 4.50 లక్షల కోట్లు) 2017-18లో 60.97 బిలియన్ డాలర్లు(రూ. 4.56 లక్షల కోట్లు) 2018-19 లో 62 బిలియన్ డాలర్ల(రూ. 4.64 లక్షల కోట్ల) ఎఫ్‌డీఈలు వచ్చాయి.

ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, ఇందులో అనేక రంగాలు ఆటోమెటిక్ రూపంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అందుబాటులో ఉన్నాయని సోమ్ ప్రకాష్ తెలిపారు. భవిష్యత్తులో కూడా భారత్‌ను ఆకర్షణీయమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన కేంద్రంగా నిలిపేందుకు ఎఫ్‌డీఐ పాలసీని నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇటీవల అనేక రంగాల్లో సంస్కరణలు చేపట్టింది. గతేడాది కాలంలోనే బీమా, రక్షణ, పెట్రోలియం, సహజవాయువు, టెలికాం వంటి రంగాల్లో ఎఫ్‌డీఐ విధానాల్లో మార్పులు చేసిందన్నారు. ఎఫ్‌డీఐలు పెరగడం వల్ల దేశీయంగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహంతో పాటు వివిధ రంగాలు, అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు వీలుంటుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed