కొనసాగుతున్న ఐడీబీఐ ప్రైవేటీకరణ బిడ్లను పరిశీలన: దీపమ్ కార్యదర్శి!

by Hamsa |
కొనసాగుతున్న ఐడీబీఐ ప్రైవేటీకరణ బిడ్లను పరిశీలన: దీపమ్ కార్యదర్శి!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రక్రియ సరైన ట్రాక్‌లో ఉందని ప్రభుత్వం శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) తర్వాతి దశలో ఉందని, అనంతరం జరగాల్సిన ప్రక్రియ కొనసాగుతోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండె అన్నారు. ఇటీవల ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వాయిదా వేసే అవకాశం ఉందని వస్తున్న కథనాలపై స్పందించిన దీపమ్ అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చింది. ఐడీబీఐలో ప్రభుత్వానికి, ఎల్‌ఐసీలకు సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది.

అందులో 60.72 శాతం వాటాను విక్రయించడం కోసం అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించింది. ఈ ఏడాది జనవరిలో దేశీయ, విదేశీ సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లలను దీపమ్ స్వీకరించింది. ఆ ప్రాథమిక బిడ్ల పక్రియ జనవరి 7వ తేదీతో ముగిసింది. ప్రస్తుతానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ బిడ్లను పరిశీలిస్తున్నాయి. దీని తర్వాత బిడ్డర్‌లు రెండవ దశ బిడ్డింగ్ ప్రక్రియకు వెళ్లేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఈఓఐలు సమర్పించిన పెట్టుబడిదారులు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించారు. అనంతరం సెప్టెంబరు కల్లా ఆర్థిక బిడ్లు అందే అవకాశం ఉందని తుహిన్ కాంత పాండె తెలిపారు. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో లావాదేవీ పూర్తవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed