హాలీవుడ్ ఐకాన్ నిర్మాణ సంస్థ పారామౌంట్ గ్లోబల్‌ను కొనుగోలు చేసిన స్కైడ్యాన్స్ సంస్థ

by S Gopi |
హాలీవుడ్ ఐకాన్ నిర్మాణ సంస్థ పారామౌంట్ గ్లోబల్‌ను కొనుగోలు చేసిన స్కైడ్యాన్స్ సంస్థ
X

దిశ, బిజినెస్ బ్యూరో: హాలీవుడ్ సినిమాలకు సంబంధించి అత్యంత పురాతన సంస్థల్లో ఒకటైన పారామౌంట్ గ్లోబల్‌ను ప్రముఖ ఇండిపెండెంట్ ఫిల్మ్ స్టూడియో స్కైడ్యాన్స్ మీడియాలో విలీనం అయింది. ఈ మేరకు పారామౌంట్ గ్లోబల్ సంస్థ ఛైర్మన్‌ షరీ రెడ్‌స్టోన్‌ అంగీకరించారు. దీనికి ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆమోదించడంతో 1936 నుంచి పారామౌంట్ కంపెనీపై ఉన్న షరీ రెడ్‌స్టోన్ నియంత్రణ స్కైడ్యాన్స్ చెంతకు వెళ్లనుంది. ఒప్పందం ప్రకారం, పారామౌంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ షరీ రెడ్‌స్టోన్ తన కుటుంబ వాటాను విక్రయించడంతో 28 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 2.34 లక్షల కోట్ల) విలువైన సంస్థగా ఏర్పడుతుంది. దీంతో దివంగత పాట్రియార్క్, సమ్మర్ రెడ్‌స్టోన్‌లు స్థాపించిన రెడ్‌స్టోన్ కుటుంబ శకం ముగిసింది. పారామౌంట్ సంస్థకు అనుబంధంగా సీబీఎస్, కామెడీ సెంట్రల్, నికెలొడియన్, ఎంటీవీ వంటి టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఇవి 180 కంటే ఎక్కువ దేశాలలో 430 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఒప్పందం ఖరారు కావడానికి ముందు పారామౌంట్ సంస్థ సోనీ, అపోలో లాంటి దిగ్గజ సంస్థలతో కూడిన చర్చలు జరిపింది. పారామౌంట్, స్కైడ్యాన్స్ మధ్య ఒప్పందం 2025 నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పారామౌంట్ గ్లోబల్ 1914లో పారామౌంట్ పిక్చర్స్ కార్పొరేషన్ స్థాపించడం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గాడ్‌ఫాదర్, స్టార్ ట్రెక్, మిషన్: ఇంపాజిబుల్ సిరీస్‌లతో సహా అనేక హిట్ చిత్రాలను స్టూడియో నిర్మించింది. ఇక, ఈ సంస్థను కొన్న స్కైడ్యాన్స్ వ్యవస్థాపకుడు డేవిడ్ ఎల్లిసన్ అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్‌ను స్థాపించిన లారీ ఎల్లిసన్ కుమారుడు కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed