వచ్చే వారం నుంచి రూ. 29కే 'భారత్ రైస్' అమ్మకాలు

by S Gopi |
వచ్చే వారం నుంచి రూ. 29కే భారత్ రైస్ అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రిటైల్ మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలను నియంత్రిస్తూనే, సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'భారత్ రైస్ ' బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాలను వచ్చే వారం ప్రారంభించనున్నట్టు తెలిపింది. కిలో రూ. 29కే భారత్ రైస్ లభిస్తుందని, ధరలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా బియ్యం స్టాక్‌ వివరాలను వ్యాపారుల నుంచి కోరినట్టు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ ఛొప్రా శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ గత ఏడాది కాలంలో బియ్యం రిటైల్, టోకు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. ఈ ధరల కట్టడికి నేషనల్‌ అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(నాఫెడ్), నేషనల్ కోపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో 'భారత రైస్ 'ను రూ. 29కే విక్రయిస్తామని సంజీవ్ ఛోప్రా వివరించారు. 5, 10 కేజీల బ్యాగుల్లో వాటి విక్రయానికి సిద్ధం చేశామని, తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని అమ్మనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే భారత్ గోధుమ పిండి కిలో రూ.27.50కి, భారత్ దాల్ (శెనగపప్పు) కిలో రూ.60కి విక్రయిస్తోంది. ఇదే సమయంలో బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారనే పుకార్లను సంజీవ్ ఛోప్రా ఖండించారు. ధరలు నియంత్రణలోకి వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని, రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశాలిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed