LIC: ఎల్‌ఐసీలో మరో 5 శాతం వాటా తగ్గించే యోచనలో ప్రభుత్వం

by S Gopi |
LIC: ఎల్‌ఐసీలో మరో 5 శాతం వాటా తగ్గించే యోచనలో ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వం మరో 5 శాతం వాటాను విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్(ఎంపీఎస్) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎల్ఐసీలో 96.5 శాతం వాటాను ప్రభుత్వం కలిగి ఉంది. వాటాను తగ్గించేందుకు ప్రభుత్వం ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ), క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) విధానాలను పరిశీలిస్తున్నట్టు నివేదికలు వెల్లడించాయి. 2022, మేలో ఎల్ఐసీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా ప్రభుత్వం రూ. 21,000 కోట్లను సమీకరించింది. ఇది దేశ ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అతిపెద్దది. ఈ ఐపీఓ పూర్తిగా ప్రభుత్వం నుంచి ఆఫర్-ఫర్-సేల్ రూపంలో 221,374,920 ఈక్విటీ షేర్లు విక్రయించబడ్డాయి. ఒక్కో షేరు ధర రూ. 949గా నిర్ణయించారు. తర్వాత, 2023 డిసెంబర్ 20న ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్ఐసీకి లిస్టింగ్ తేదీ నుంచి 10 ఏళ్లలోపు 25 శాతం ఎంపీఎస్‌కి చేరుకునేందుకు 2032, మే వరకు మినహాయింపును మంజూరు చేశాయి. ఈ మినహాయింపు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నట్టు ఆ సమయంలో ప్రభుత్వం పేర్కొంది. అనంతరం 2024 మే 14న, సెబీ 10 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ కోసం ఎల్ఐసీకి 2027 మే 16 వరకు మూడేళ్లపాటు పొడిగింపును ఇచ్చింది. ఈ గడువులోపు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం తన హోల్డింగ్‌లను క్రమంగా విక్రయిస్తుందని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed