Toll Plaza: టోల్ ప్లాజాలకు గుడ్‌బై.. త్వరలో జీపీఎస్-ఆధారిత టోల్ వసూలు

by S Gopi |
Toll Plaza: టోల్ ప్లాజాలకు గుడ్‌బై.. త్వరలో జీపీఎస్-ఆధారిత టోల్ వసూలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం ఎదురుచూడాల్సిన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. హైవేల్లో ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం సరికొత్త టెక్నాలజీతో టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్-ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను తీసుకురానుంది. చాలాకాలంగా దీనిపై చర్చ ఉన్నప్పటికీ మంగళవారం కేంద్రం శాటిలైట్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు విధానాన్ని నోటిఫై చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హైవే టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్-ఆధారిత టోల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం (సెప్టెంబర్ 10) జాతీయ రహదారుల రుసుము (రేట్లు, సేకరణ) నియమాలు-2008ను సవరించింది. దీనికి బదులు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలును చేర్చింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ సవరణలు టోల్ వసూలు చేసేందుకు.. యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్)తో ఆన్-బోర్డ్ యూనిట్లు(ఓబీయూ) ఉన్న వాహనాల నుంచి టోల్‌ వసూలు జరగనుంది. ఇది ఇప్పుడున్న ఫాస్ట్‌ట్యాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) టెక్నాలజీ వ్యవస్థాలకు అదనంగా పనిచేయనుంది.

ఏవైతే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌తో ఓబీయూ ఉన్న వాహనాలు టోల్ ప్లాజా నుంచి ప్రయాణిస్తాయో, ఆ ప్రయాణించిన దూరానికి టోల్ ఫీజు ఆటోమెటిక్‌గా పేమెంట్ వసూలవుతుంది. దీనికోసం టోల్ ప్లాజాల వద్ద ఓబీయూలున్న వాహనాల కోసం విడిగా లేన్‌లను ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన వాహనాలకు సాధారణ టోల్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ కొత్త విధానంలో నేషనల్ హైవేలపై మొదటి 20 కిలోమీటర్లకు ఎలాంటి టోల్ ఉండదు. ఆపైన ప్రయాణం చేసే దూరాన్ని బట్టి టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం, వాహనంలో ఉండే పరికరం వాహనం ప్రయాణించే దూరాన్ని లెక్కిస్తుంది. దాని ఆధారంగా ప్రయాణించే దూరానికే టోల్ వర్తిస్తుంది. పైగా టోల్ ప్లాజాల వద్ద ఆగే పని ఉండదు. మొదట ఈ విధానాన్ని నేషనల్ హైవేలతో పాటు ఎక్స్‌ప్రెస్‌వేలపై అమలు చేయనుండగా, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి కేంద్రం ప్రస్తుతం ఫాస్టాగ్‌ విధానాన్ని అనుసరిస్తోంది. దీనికి బదులు కొత్త శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు ఖచ్చితమైన ట్రాకింగ్‌ను అందిస్తుంది. అంతేకకౌందా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) టోల్ ప్లాజాల నుంచి ఏటా రూ. 40 వేల కోట్ల ఆదాయం సంపాదిస్తోంది. కొత్త టోల్ విధానం పూర్తిస్థాయిలో అమలైతే 2-3 ఏళ్లలో రూ. 1.4 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.

Advertisement

Next Story

Most Viewed