రెండుగా విడిపోయిన 127 ఏళ్ల తాళాల తయారీ సంస్థ

by S Gopi |
రెండుగా విడిపోయిన 127 ఏళ్ల తాళాల తయారీ సంస్థ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గోద్రేజ్ పేరు శతాబ్దానికి భారత ప్రజలకు నమ్మకమైన బ్రాండ్. తొలినాళ్లలో తాళాలు తయారు చేసిన ఈ కంపెనీ మారుతున్న ట్రెండ్‌కు తగినట్టుగా అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. తాళాలు, లాకర్ల తయారీలో అత్యంత నాణ్యమైన బ్రాండుగా ఉన్న గోద్రేజ్ సబ్బులు, గృహోపకరణాలతో పాటు రియల్టీ రంగాల్లోనూ విస్తరించింది. అయితే, 127 ఏళ్లుగా దేశ వ్యాపార రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసిన గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు రెండుగా విడిపోనుంది. సంస్థ వారసులు వ్యాపారాన్ని పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. వారసుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వాటాల పంపకం పూర్తయినట్టు సమాచారం. ఒప్పందం ప్రకారం, ఐదు లిస్టెడ్ కంపెనీలతో కూడిన గోద్రేజ్ ఇండస్ట్రీస్‌ని ఆది గోద్రేజ్, అతని సోదరుడు నదీర్‌లకు సొంతం కాగా, జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణలకు గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్‌లోని అన్‌లిస్టెడ్ గోద్రేజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ కంపెనీలు దక్కాయి. ఇవి కాకుండా ముంబైలో ఉన్న 3,400 ఎకరాల భూమి కూడా వీరికి దక్కనుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన గోద్రేజ్.. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో ఆది గోద్రేజ్ కుమార్తె ఫిరోజ్ షా గోద్రేజ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్‌గా ఉంటారు. 2026, ఆగష్టులో వారు బాధ్యతలు తీసుకోనున్నారు. గోద్రేజ్ అండ్ బోయ్స్ గ్రూపునకు సీఎండీగా జమ్షెడ్ గోద్రేజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా న్యారికా హోల్కర్ ఉండనున్నారు.

కంపెనీ చరిత్ర..

వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆర్దేశిర్ గోద్రేజ్ 1897లో సంస్థను స్థాపించారు. దేశం మీద ప్రేమతో ఇతర దేశాలతో పోటీపడే స్థాయిలో వస్తువులను తయారు చేయాలనే లక్ష్యంతో ఆయన సంస్థను ఏర్పాటు చేశారు. స్నేహితుడి తండ్రి వద్ద నుంచి అప్పు చేసి సర్జికల్ టూల్స్‌ను మొదట తయారు చేశారు. అది విఫలం కావడంతో తాళాల తయారీ మొదలుపెట్టారు. అక్కడి నుంచి సంస్థ 1907లో తొలి స్ప్రింగ్‌లెస్ లాక్, 1914లో బీరువాల తయారీలోకి అడుగుపెట్టింది. వందేళ్లు దాటిన గోద్రేజ్ తాళాలకు ఉన్న గిరాకీయే సంస్థ నిబద్దతకు కారణం. ఇప్పటికీ సంస్థ సరికొత్త టెక్నాలజీతో కూడిన స్మార్ట్ తాళాలు తయారు చేస్తోంది.

రికార్డులు..

అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన గోద్రేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే మొదటి వెజిటబుల్ సబ్బుతో పాటు తొలి దేశీయ టైప్ రైటర్‌ను, దేశ తొలి ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను గోద్రేజ్ తయారు చేసి అరుదైన రికార్డులను సాధించింది. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన మంగళయాన్, చంద్రయా మిషన్‌లలోనూ గోద్రేజ్ సహకారం ఉంది. చంద్రయాన్-3 మిషన్ కోసం ముఖ్యమైన పరికరాలను అందిస్తోంది.

గోద్రేజ్ ఫ్యామిలీ..

1897లో ఆర్జేశిర్ గోద్రేజ్, ఆయన సోదరుడు ఫిరోజ్ షా సంస్థను స్థాపించారు. ఆర్జేశిర్‌కు సంతానం లేరు. ఫిరోజ్ షాకు సౌహ్రాబ్, దోసా, బుర్జోర్, నావల్ వారసులు. బుర్జోర్‌కు ఆది, నదిర్ వారసులు. నావల్‌కు జమ్షెడ్, స్మిత వారసులు. వీరే ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపును నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed