GenAI: జెన్ ఏఐతో 45 శాతం పెరగనున్న భారత ఐటీ పరిశ్రమ ఉత్పాదకత: ఈవై సర్వే

by S Gopi |
GenAI:  జెన్ ఏఐతో 45 శాతం పెరగనున్న భారత ఐటీ పరిశ్రమ ఉత్పాదకత: ఈవై సర్వే
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(జెన్ ఏఐ) వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం టెక్ రంగంలో జెన్ ఏఐ ఉత్పాదకత రూ. 22.22 లక్షల కోట్లుగా ఉందని, వచ్చే ఐదేళ్లలో ఇది 43-45 శాతం మేర పెరుగుతుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఈవై ఇండియా వెల్లడించింది. ఉత్పాదకతలో వృద్ధి ప్రధానంగా ఐటీ పరిశ్రమ నుంచే వస్తుందని, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐని ఎక్కువ ఉపయోగిస్తుండటం, క్లయింట్ల నుంచి వచ్చే ప్రాజెక్ట్‌లలో ఏఐ-ఆధారిత పరిష్కారాలను అందించే ప్రక్తియను విస్తరించడం ద్వారా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సాంకేతిక సంస్థలు తమ క్లయింట్లతో కొత్త కార్యక్రమాల కోసం ఏఐ వినియోగాన్ని పెంచినట్లు చెప్పాయి. ఇవికాకుండా 89 శాతం ఐటీ కంపెనీలు జెన్ ఏఐ ట్రయల్స్‌ను ప్రారంభించాయని, వీటిలో 33 శాతం ప్రాజెక్ట్‌లు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉత్పత్తి దశకు చేరుకున్నాయని ఈవై ఇండియా సర్వే తెలిపింది. ప్రధానంగా వివిధ ఐటీ రోల్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాల్లో జెన్ ఏఐ ద్వారా ఉత్పాదకత 60 శాతం మేర పెరగనుంది. ఆ తర్వాత బీపీఓ సేవల్లో, ఐటీ కన్సల్టింగ్‌లో సగటున 50 శాతం ఉత్పాదకత ఊపందుకోనుంది. జెన్ ఏఐ ఐటీ పరిశ్రమలో కస్టమర్ సేవలను మెరుగుపరిచేందుకు సహాయపడటమే కాకుండా ఖర్చులను తగ్గించనుంది. ఆదాయాన్ని పెంచుతుందని ఈవై ఇండియా పేర్కొంది.

Next Story

Most Viewed