ఎలక్ట్రిక్ వాహన వ్యాపారంలోకి అదానీ గ్రూప్

by S Gopi |
ఎలక్ట్రిక్ వాహన వ్యాపారంలోకి అదానీ గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బకు సగానికి పైగా పతనమైన అదానీ గ్రూప్ తిరిగి అంతే ఉత్సాహంతో దూసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. దానికోసం బిలీయనీర్ గౌతమ్ అదానీ మరో కొత్త రంగంలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దేశీయ కీలక రంగాలైన విద్యుత్, మౌలికం, విమానయాన్, గ్రీన్ ఎనర్జీ వంటి వాటిలో సత్తా చాటిన అదానీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వ్యాపారంపై దృష్టి సారించారు. దీనికోసం ఉబర్ టెక్నాలజీస్‌తో అదానీ గ్రూప్ వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఉబర్‌కు చెందిన రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లో అదానీ సొంతంగా ఈవీ కార్లను ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం.


ఇటీవల ఉబర్, అదానీ సంస్థల అధినేతలు దారా ఖోస్రోషాహి, గౌతమ్ అదానీ మధ్య జరిగిన చర్చలో.. అదానీ కార్లను కొనుగోలు చేసి, వాటిని బ్రాండ్ చేసి ఉబర్ నెట్‌ వర్క్‌లో చేర్చాలని మాట్లాడుకున్నారు. అదానీ సొంతంగా ఈవీ కార్లను తయారు చేయనప్పటికీ, ఉబర్ సహకారంతో సంస్థ ప్రధాన వ్యాపారాలైన పోర్టులు, విమానాశ్రయ కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, అదానీ వాహనాలను కొనుగోలు, బ్రాండింగ్ చేస్తుంది. అనంతరం ఉబర్ నెట్‌వర్క్‌లో చేరుస్తుంది. ఇటీవలే సంస్థ 3,600 ఈవీ బస్సుల కోసం ప్రభుత్వ టెండర్‌లో వేలం వేసింది. మరోవైపు, ఉబర్ సైతం 2040 నాటికి జీరో ఎమిషన్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించాలనే లక్ష్యాన్ని చేరేందుకు ప్రస్తుత వాహనాలను ఈవీలతో భర్తీ చేయనుంది. కాగా, భారత మార్కెట్లోకి 2013లో ప్రవేశించిన ఉబర్ సంస్థ ప్రస్తుతం 125 నగరాల్లో సేవలందిస్తోంది. దీనివల్ల అదానీ సూపర్ యాప్ 'అదానీ వన్' విస్తరణకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.

Advertisement

Next Story