డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు

by S Gopi |
డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ ఏడాది జనవరిలో దేశ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇది గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకెళ్లారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, సమీక్షిస్తున్న నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ. 19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచ్చిన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను చేర్చడంతో దేశ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. రానున్న 18-24 నెలల వ్యవధిలో మరో రూ. 1.65 లక్షల కోట్ల నుంచి రూ. 3.3 లక్షల కోట్ల వరకు ప్రయోజనాలు ఉండనున్నాయని, ఇది భారతీయ బాండ్లను విదేశీ ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని హిమాన్షు వివరించారు. తద్వారా భారత కరెన్సీ రూపాయి బలపడే అవకాశం ఉంటుందని, ఆర్థికవ్యవస్థ వృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని వెల్లడించారు.

Advertisement

Next Story