IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు జూన్ కల్లా ఆర్థిక బిడ్లు!

by Harish |
IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు జూన్ కల్లా ఆర్థిక బిడ్లు!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం మరో మూడు నెలల్లో ఆర్థిక బిడ్లు కోరాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాటాల ప్రక్రియలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరింత సమాచారాన్ని కోరింది. అన్ని పత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఆర్‌బీఐ నుంచి సరైన క్లియరెన్స్ తర్వాత బిడ్డర్ల రెండో దశ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలు ముగిసిన తర్వాత ఆర్థిక బిడ్లను ఆహ్వానించడం జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.

ఇటీవలే ప్రైవేటీకరణ ప్రక్రియ ఆలస్యం కావొచ్చంటూ వస్తున్న వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ(దీపమ్‌) ఖండించిన సంగతి తెలిసిందే. ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) తర్వాతి దశలో ఉందని, అనంతరం జరగాల్సిన ప్రక్రియ కొనసాగుతోందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండె అన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీ పూర్తవుతుందని, భౌగోళిక రాజకీయ పరిస్థితుల మార్కెట్ సెంటిమెంట్, వాటా విక్రయ ప్రక్రియ ప్రభావితం అవుతోందని అధికారి వివరించారు. అన్ని సానుకూలంగా జరిగితే జూన్ నాటికి ఆర్థిక బిడ్లు అందుతాయన్నారు. కాగా, ఐడీబీఐలో ప్రభుత్వానికి, ఎల్‌ఐసీలకు సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది. అందులో 60.72 శాతం వాటాను విక్రయిస్తున్నాయి.

Advertisement

Next Story