గోల్డ్ లోన్‌ అకౌంట్లను సమీక్షించాలని పీఎస్‌యూ బ్యాంకులకు ఆదేశాలు

by S Gopi |
గోల్డ్ లోన్‌ అకౌంట్లను సమీక్షించాలని పీఎస్‌యూ బ్యాంకులకు ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్ఎస్) పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లకు లేఖ పంపింది. బంగారు రుణాలకు సంబంధించిన పనితీరు, ప్రక్రియలను పరిశీలించాలని తెలిపింది. 2022, జనవరి 1 తర్వాత జారీ చేసిన ప్రతి గోల్డ్ లోన్ అకౌంట్‌ను సమీక్షించాలని పేర్కొంది. బ్యాంకులు ఆయా ఖాతాల విలువను, ఛార్జీలను విశ్లేషించాలని, ఏదైనా గడువు పొడిగింపు వంటి అంశాలను చూడాలని తెలిపింది. గోల్డ్ లోన్ వ్యాపారంపై సమగ్రమైన సమీక్ష చేపట్టాలని బ్యాంకులను కోరామని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి చెప్పారు.

గతేడాది కంటే ఈసారి గోల్డ్ లోన్లు వేగంగా పెరుగుతున్న కారణంగానే ఈ సర్క్యులర్ జారీ చేసినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. పసిడి ధరలు ఏడాది ప్రాతిపదికన 16.6 శాతం పెరిగితే గోల్డ్ లోన్‌లు 17 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి 26 నాటికి బంగారు ఆభరణాలపై రుణాలు రూ. 1.01 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2023, డిసెంబర్ నాటికి ఎస్‌బీఐ మాత్రమే మొత్తం రుణంలో రూ. 30,881 కోట్ల గోల్డ్ లోన్లు ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 5,315 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 3,682 కోట్లను జారీ చేశాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, గోల్డ్ లోన్‌లను ఆభరణాల విలువలో 75 శాతం మాత్రమే ఇస్తాయి. అయితే, కరోనా సమయంలో ఈ నిబంధనలను సడలించారు.

Advertisement

Next Story

Most Viewed