దేశీయ తయారీని పెంచడానికి బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని హేతుబద్ధం చేయాలి: ఐసీసీ

by Harish |
దేశీయ తయారీని పెంచడానికి బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని హేతుబద్ధం చేయాలి: ఐసీసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాల నుంచి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) కొన్ని కీలక అంశాల గురించి ప్రభుత్వానికి సూచనలు అందించింది. దేశీయ తయారీని పెంచే ప్రయత్నంలో భాగంగా స్టీల్, సోలార్ బ్యాటరీ, అల్యూమినియం, లిథియం సెల్‌లతో సహా వివిధ రంగాలలో కస్టమ్స్ డ్యూటీలను హేతుబద్ధం చేయాలని కోరింది. భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ముడి పదార్థాలపై విధించే సుంకాలు దేశీయ తయారీదారులపై ప్రత్యేకించి దిగువ సంస్థలపై ప్రభావం చూపుతున్నాయని, పరిశ్రమల వృద్ధికి రక్షణ చర్యలు అవసరమని ఐసీసీ ప్రెసిడెంట్ అమేయ ప్రభు అన్నారు.

మిక్స్‌డ్ పెట్రోలియం గ్యాస్‌పై సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం ద్వారా ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిదిద్దాలని ఆయన కోరారు. పాలీ వినైల్ క్లోరైడ్, పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, పాలీప్రొఫైలిన్, పాలిస్టర్లపై సుంకాన్ని 10 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. ఇది దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో దేశీయంగా ఉత్పత్తి పెరిగి, పెట్రోకెమికల్ తయారీ విభాగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపిస్తుందని అమేయ ప్రభు చెప్పారు. పన్నుల విషయంలో, ఆదాయపు పన్ను చట్టం 1961ని పూర్తిగా సమీక్షించడానికి, నిబంధనలను సరళీకృతం చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐసీసీ ఛాంబర్ సూచించింది. అలాగే, డివిడెండ్లపై పన్ను విధించవద్దని ప్రభుత్వానికి ఐసీసీ సిఫార్సు చేసింది.

Advertisement

Next Story

Most Viewed