మారుతున్న ఉద్యోగుల నియామక ధోరణి.. అనుభవమే ముఖ్యమంటున్న కంపెనీలు

by Harish |   ( Updated:2024-07-11 10:26:31.0  )
మారుతున్న ఉద్యోగుల నియామక ధోరణి.. అనుభవమే ముఖ్యమంటున్న కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల ఎంపికలో కంపెనీలు తమ ధోరణిని మార్చుకుంటున్నాయి. ఇంతకు ముందు అభ్యర్థుల వయస్సు, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చిన కంపెనీలు ప్రస్తుతం అనుభవం ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని ఇటీవల విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. 29 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌‌లో చేరారని డేటా పేర్కొంది. ఇది ఎఫ్‌వై19లో 21.7 శాతంతో పోలిస్తే ఎఫ్‌వై24లో 36.6 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఐదేళ్ల క్రితం 39.9 శాతంగా ఉన్న యువ ఉద్యోగుల వాటా ఎఫ్‌వై24లో 25.2 శాతానికి క్షీణించడం గమనార్హం.

కోవిడ్ తర్వాత తక్కువ ఖర్చులో అనుభవజ్ఞులైన కార్మికులు సులభంగా అందుబాటులో ఉండడం ఈ మార్పుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. నివేదిక ప్రకారం, ఎఫ్‌వై20లో ఈపీఎఫ్ స్కీంలో చేరిన 21 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు కలిగిన వారి వాటా 28.7 శాతం నుంచి ఎఫ్‌వై22లో 24.8 శాతానికి తగ్గింది. అదే 22-28 సంవత్సరాల వయస్సు గల వారి వాటా 38-39 శాతం వద్ద స్థిరంగా ఉంది. అలాగే, ఉద్యోగుల నియామకంలో అనుభవజ్ఞులైన మహిళల వాటా పురుషుల కంటే వేగంగా పెరిగింది. ఎఫ్‌వై24లో అనుభవజ్ఞులైన మహిళలు ఈపీఎఫ్ స్కీంలో చేరడం 38.5 శాతంగా నమోదు కాగా, ఇది ఎఫ్‌వై19 కంటే 10 శాతం ఎక్కువ.

Advertisement

Next Story