Hindustan Zinc: హిందుస్థాన్ జింక్‌లో 2.5 శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం

by S Gopi |
Hindustan Zinc: హిందుస్థాన్ జింక్‌లో 2.5 శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వేదాంత గ్రూపునకు చెందిన హిందూస్తాన్ జింక్‌లో ప్రభుత్వం తన వాటాను విక్రయించనుంది. సంస్థలో 2.5 శాతం వరకు వాటాను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లకు పైగానే నిధులు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించే వాటాకు సంబంధించి ఒక్కో షేర్‌ను రూ. 505కే విక్రయించనుంది. ఇది ప్రస్తుతం ఉన్న ధర కంటే దాదాపు 10 శాతం డిస్కౌంట్ కావడం విశేషం. రెండు రోజుల పాటు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుందని, బుధవారం సంస్థాగత బిడ్డర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం విక్రయ ప్రక్రియ జరుగుతుందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 2002లో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న హిందూస్తాన్ జింక్ ఆ ఏడాది ఏప్రిల్‌లో 26 శాతం వాటాను వేదాంత గ్రూపునకు విక్రయించింది. ఆ తర్వాతి ఏడాదిలోనే మార్కెట్ల నుంచి 20 శాతం, ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం కొనుగోలు చేయడం ద్వారా వేదాంత గ్రూప్ యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి హిందూస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి సంస్థ షేర్ ధర రూ. 559.75 వద్ద ముగిసింది.

Advertisement

Next Story