UPI: చిన్న వ్యాపారుల యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు

by S Gopi |
UPI: చిన్న వ్యాపారుల యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తక్కువ మొత్తంతో జరిగే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చిన్న వ్యాపారులపై వ్యయ భారాన్ని తగ్గించే లక్ష్యంతో తక్కువ మొత్తం డిజిటల్ లావాదేవీల కోసం రూ. 1,500 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 2,000 వరకు పర్సన్-టు-మర్చంట్(పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. 2024, ఏప్రిల్ 1 నుంచి 2025, మార్చి మధ్య ఈ పథకం కింద రూ. 1,500 కోట్లను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు ఒక్కో లావాదేవీ మీద 0.15 శాతం చొప్పున ప్రోత్సాహకం పొందుతారు. ఆపైన జరిగే లావాదేవీ మొత్తాపై ప్రోత్సాహకాలు ఉండవు. కేబినెట్ నిర్ణయాల గురించి వెల్లడిస్తూ వచ్చే ఏడాది కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. యూపీఐ, రూపే డెబిట్‌ కార్డులతో చేసే లావాదేవీలకు వ్యాపారులపై త్వరలో మర్చెంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లావాదేవీల రుసుము గురించి చింతించకుండా డిజిటల్ చెల్లింపుల విషయంలో చిన్న వ్యాపారులకు ప్రతి లావాదేవీపై (రూ. 2,000 వరకు లావాదేవీలకు) 0.15 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed