Stock Market: తొలిసారి 83,000 మైలురాయిని తాకిన సెన్సెక్స్

by S Gopi |
Stock Market: తొలిసారి 83,000 మైలురాయిని తాకిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. దేశీయంగా కీలక బ్లూచిప్ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల హుషారుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లభించడంతో గురువారం సూచీలు చరిత్రలోనే తొలిసారిగా 83,000 మైలురాయిని తాకాయి. వచ్చే వారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరగడం, భారత మార్కెట్ల ర్యాలీ యూరప్, ఆసియా ఇన్వెస్టర్లకు సానుకూలంగా కనిపించడం, వచ్చే వారం ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఈ వారం ఎఫ్అండ్ఓ గడువు ముగియడం వంటి అంశాలు భారత ఈక్విటీల రికార్డు ర్యాలీకి కారణమయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారత్‌కు అనుకూలంగా స్థిరంగా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే, అమెరికాలో ఆగష్టు నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినప్పటికీ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు మొగ్గు చూపించవచ్చనే అంచనాలు పెరిగాయి. ఇది గ్లోబల్ మార్కెట్ల సానుకూల ర్యాలీకి మద్దతిచ్చాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,439.55 పాయింట్లు పుంజుకుని 82,962 వద్ద, నిఫ్టీ 470.45 పాయింట్లు లాభపడి 25,388 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఆటో రంగాలు 2 శాతానికి పైగా పుంజుకోగా, మిగిలిన రంగాలు 1 శాతానికి పైగా పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ వంటి షేర్లు 2.50 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.94 వద్ద ఉంది. రికార్డు స్థాయి ర్యాలీతో గురువారం ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ. 7 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దానివల్ల బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 466 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed