కార్డు లేకుండా నగదు విత్‌డ్రా సదుపాయాన్ని ప్రారంభించిన BOB!

by Harish |   ( Updated:2023-06-05 15:06:50.0  )
కార్డు లేకుండా నగదు విత్‌డ్రా సదుపాయాన్ని ప్రారంభించిన BOB!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారుల కోసం కొత్తగా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయాలను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి యూపీఐ ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 'ఇంటర్ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా(ఐసీసీడబ్ల్యూ) సేవలను ప్రారంభించిన మొదటి ప్రభుత్వ రంగ బ్యాంకు తమది. భీమ్ యూపీఐ, బీఓబీ వరల్డ్ యూపీఐ, లేదా ఇతర యూపీఐ అప్లికేషన్లను ఉపయోగించే ఇతర బ్యాంకు వినియోగదారులు కూడా తమ మొబైల్‌ఫోన్ ద్వారా ఐసీసీడబ్ల్యూ సేవలను వినియోగించవచ్చని' బ్యాంకు వివరించింది.

ఈ సదుపాయం కోసం వినియోగదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంచుకుని, స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగదు మొత్తాన్ని ఎంటర్ చేయాలి. వినియోగదారులకు సులభమైన, సురక్షితమైన సేవలందించేందుకు, భౌతికంగా కార్డు వాడకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉపయోగపడుతుందని బ్యాంకు చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా చెప్పారు.

ఈ సేవల ద్వారా ఒక్కో లావాదేవీకి రూ. 5,000 పరిమితి ఉంటుందని బ్యాంకు తెలిపింది. దేశవ్యాప్తంగా బ్యాంకుకు చెందిన 11 వేల ఏటీఎంలలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story