మొదటి త్రైమాసికంలో 18 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం

by Harish |   ( Updated:2024-07-16 09:08:06.0  )
మొదటి త్రైమాసికంలో 18 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో మంగళవారం తన ఆర్థిక త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 18 శాతం పెరిగి రూ. 1,941.79 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. దేశీయంగా స్థిరమైన డిమాండ్, బలమైన టూ వీలర్ అమ్మకాల కారణంగా లాభం పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కార్యకలాపాల ద్వారా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదాయం 16 శాతం పెరిగి రూ. 11,932 కోట్లకు చేరుకుంది. ప్రీమియం వాహనాలు, ఉత్పత్తి, మెరుగైన విడిభాగాల వ్యాపారం కారణంగా ఆదాయం పెరగడానికి దోహదపడింది.

అమ్మకాల పరంగా చూసినట్లయితే, కంపెనీ జూన్ 2024 త్రైమాసికంలో 11,02,056 యూనిట్ల వాహనాలను విక్రయించింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయించిన 10,27,407 యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీ, పన్ను, తరుగుదల(ఎబిటా) ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం పెరిగి రూ.1,954 కోట్ల నుంచి రూ. 2,415 కోట్లకు చేరుకుంది. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, ఎగుమతి వృద్ధిని సాధించడంతో సంవత్సరానికి రెండంకెల ఆదాయం నమోదు చేసిందని, అంతేకాకుండా దేశీయ వ్యాపారం కూడా రెండంకెల వృద్ధిలో తొమ్మిదో వరుస త్రైమాసికాన్ని నమోదు చేస్తూ ఊపందుకుందని బజాజ్ కంపెనీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed