టూ-వీలర్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రానికి లేఖ రాసిన ఆటో పరిశ్రమ

by S Gopi |
టూ-వీలర్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రానికి లేఖ రాసిన ఆటో పరిశ్రమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను తగ్గించాలని కోరుతూ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. సాంప్రదాయ ఇంజిన్లు కలిగిన టూవీలర్లకు ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 18 శాతానికి, హైడ్రోజన్‌తో నడిచే జీరో-కార్బన్ వాహనాలపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా ఫ్లెక్స్ ఇంధనం(ఇథనాల్ కలిపిన పెట్రోల్ వంటివి), సీఎన్‌జీ వంటి తక్కువ-కార్బన్ ఉద్గార మోడళ్లపై జీఎస్టీని మొదటిదశలో 28 శాతం నుంచి 18 శాతానికి, ఆ తర్వాత 12 శాతానికి తగ్గించాలని కోరింది. అధిక క్యూబిక్ కెపాసిటీ(సీసీ) గల బైకులపై విధించిన 3 శాతం అదనపు సెస్‌ను కూడా తొలగించాలని సియామ్ లేఖలో పేర్కొంది. ప్రభుత్వం శిలాజ ఇంధనాలతో నడిచే స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపై 28 శాతం(350సీసీ కంటే ఎక్కువ ఉన్నవాటిపై 3 శాతం సెస్) జీఎస్టీ విధిస్తోంది. ఇది ప్రపంచంలోని ఇతర మార్కెట్ల కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌లో అత్యల్పంగా 7 శాతం, అత్యధికంగా మెక్సికోలో 16 శాతం వరకు మాత్రమే పన్నులున్నాయని సియామ్ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యూయల్, సీఎన్‌జీ వంటి కొత్త టెక్నాలజీ అభివృద్ధికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీఎస్టీ తగ్గింపు ద్వారా మోటార్‌సైకిళ్ల ధరలు దిగొస్తాయని, వినియోగదారులకు కూడా ప్రయోజనాలు ఉంటాయని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హనీఫ్ ఖురేషీకి రాసిన లేఖలో వివరించింది.

Advertisement

Next Story

Most Viewed