వంటనూనె ధరలు తగ్గించాలని కేంద్రం సూచన

by S Gopi |
వంటనూనె ధరలు తగ్గించాలని కేంద్రం సూచన
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి వంటనూనె ధరలు పెరిగాయి. కేంద్రం ఎప్పటికప్పుడు దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని ప్రభుత్వం వంటనూనె బ్రాండ్ కంపెనీలకు సూచించింది. ఈ మేరకు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్ల అసోసియేషన్ తెలిపింది. అయితే, తక్షణం ధరలను తగ్గించడం సాధ్యం కాదని కంపెనీలు చెబుతున్నాయి. ఆవాల పంట కోత మొదలయ్యే మార్చి వరకు రిటైల్ ధరలను తగ్గించడం వీలవదని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి. సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ వంటి నూనెలపై ఎంఆర్‌పీని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశ్రమకు చెందిన అధికారులు పేర్కొన్నారు. వంటనూనె ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ధరల ట్రెండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా ఎంఆర్‌పీని సవరించడం జరుగుతుంది. తక్షణమే తగ్గించడం కష్టమని ఫార్చ్యూన్ బ్రాండ్ వంటనూనె విక్రయించే అదానీ విల్మార్ సీఈఓ అంగ్‌షూ మల్లిక్ చెప్పారు. చాలా సంస్థలు ధరలను 3-4 శాతం మాత్రమే తగ్గించగలవని ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story