1,000 మందికి పైగా పైలట్లను నియమించుకోనున్న ఎయిర్ ఇండియా!

by Mahesh |   ( Updated:2023-04-27 15:46:26.0  )
1,000 మందికి పైగా పైలట్లను నియమించుకోనున్న ఎయిర్ ఇండియా!
X

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ, టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కొత్తగా 1,000 మందికి పైగా పైలట్లను నియమించుకోనున్నట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. కొత్త విమానాలు, నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా కెప్టెన్లు, ట్రైనర్లతో సహా పైలట్ల నియామకాలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా 1,800 కంటే ఎక్కువ పైలట్లను కలిగి ఉంది. కొత్తగా ఎయిర్‌బస్, బోయింగ్‌లకు చెందిన 470 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో వైడ్-బాడీ విమానాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌బస్ సంస్థకిచ్చిన ఆర్డర్‌లో 210 ఏ320, ఏ321 నియో/ఎక్స్ఎల్ఆర్ విమానాలు, 40 ఏ350-900/1000 విమానాలు ఉన్నాయి. అలాగే, బోయింగ్ నుంచి 190 బీ737 మ్యాక్స్, 20 బీ787, 10 బీ777 విమానాలను కొనుగోలు చేయనుంది. ఏ320, బీ777, బీ787, బీ737 విమానాలలో కెప్టెన్‌లు, ఫస్ట్ ఆఫీసర్, ట్రైనర్ల నియామకాలను చేపడుతున్నట్టు కంపెనీ పేర్కొంది. మరోవైపు, ఇటీవల ఎయిర్ఇండియా చేపట్టిన వేతన సవరణపై సంస్థ పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల ఏప్రిల్‌ 17న పైలెట్లు, క్యాబిన్‌ క్రూ సిబ్బందికి చెల్లించే జీతాలు, కాంట్రాక్ట్‌లను ఎయిండియా సవరించింది. అయితే, ఈ నిర్ణయాన్ని పైలెట్ల యూనియన్లు ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్‌ అసోషియేషన్‌ (ఐసీపీఏ), ఇండియన్‌ పైలెట్స్‌ గిల్డ్‌ (ఐపీజీ) వ్యతిరేకించాయి. తమని సంప్రదించకుండా హెచ్‌ఆర్‌ విభాగం కాంట్రాక్ట్‌ సవరణ, జీతభత్యాలపై నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Next Story