MMTS రైళ్లలో పానిక్ బటన్స్.. మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

by Ramesh N |
MMTS రైళ్లలో పానిక్ బటన్స్.. మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల భద్రత కోసం ఎంఎంటీఎస్ (MMTS trains) రైళ్లలో 'పానిక్ బటన్'ను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయనున్నది. ఇటీవల హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైళ్లో మహిళపై అత్యాచారయత్నం జరిగిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికుల భద్రతపై మరోసారి దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్, రైలు బోగీల్లో సీసీ కెమెరాలు, ఆర్‌పీఎఫ్ పోలీసుల నిఘా పెంచాలని ఎస్సీఆర్ నిర్ణయించింది. పానిక్ బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రైల్వే పోలీస్ వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి బోగీని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా రైళ్లలో భద్రత పై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆరా తీసి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

'పానిక్ బటన్' ఎలా పని చేస్తుందంటే?

కాగా, మహిళల భద్రత కోసం రైళ్లలో 'పానిక్ బటన్'ను గతంలోనే కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అందుకు సెంట్రల్ రైల్వే 117 రైల్వే పానిక్ బటన్‌లను ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. అవి ఎంత వరకు అందుబాటులోకి వచ్చాయో అధికారుల నుంచి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, 'పానిక్ బటన్' ఎలా పని చేస్తుందంటే.. అత్యవసర పరిస్థితుల్లో తరచుగా ఉపయోగించే భద్రతా పరికరాలలో పానిక్ బటన్ ఒకటి. బటన్‌ను నొక్కిన తర్వాత ఆర్‌పీఎఫ్‌ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్‌ వెళ్తుంది. దీంతో అవసరమైన వారికి త్వరగా మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. సీసీటీవీల ద్వారా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటారు.

Next Story