- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ugadi Vibes: మోదుగాకు డొప్పల్లో పచ్చడి.. పసందైన భక్ష్యాలు! ఆహా ఉగాది ఎంత మధురం

మీది ఏ రాశి ? ఎట్లుంది మీ జాతకం ?
ఆదాయమెంత ? ఖర్చెంత ?
రాజపూజ్యమెంత ? అవమానమెంత ?
ఈ లెక్కల్లో బిజీగా ఉన్నారా..?
ఫిఖర్ నై మత్ బ్రో..
ఉన్ననాడు ఉగాది.. లేనినాడు కాముని పండుగ.
ఊరుతో ఉగాది.. ఫికర్ జేస్కుంట కూర్చుంటమా.?
ఓ ఐదారు మోదుగాకులు తీసుకో..
డొప్ప తయారుజేసి.. పచ్చడి పోసుకొని.. ఆస్వాదించు !
- దిశ, ఫీచర్స్
సంక్రాంతికి సకినప్పలు.. దసరాకు యాటకూర.. దీపావళికి మిఠాయి.. అట్లనే ఉగాదికి పచ్చడి స్పెషల్. ఒకే రుచితో కాకుండా షడ్రుచులను కలిపి చేసే విశిష్టమైన ద్రవ పదార్థమే ఈ పచ్చడి. నాటికీ.. నేటికీ పచ్చడిలో పరమార్థం ఒక్కటేగానీ.. సేవించే విధానంలో మార్పొచ్చింది.
షడ్రుచుల పానీయం
‘ఉగాది పచ్చడి చేయాలా?’ అని అమ్మ అడిగితే.. ‘టైం వేస్ట్ ఎందుకు మమ్మీ.. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాంలే’ అని సలహా ఇచ్చే పిల్లలున్న జమానా ఇది. ‘మామిడికాయ పచ్చడి తెలుసు.. టమాటా పచ్చడి తెలుసు.. ఈ ఉగాది పచ్చడేంటి కొత్తగా’ అని డౌట్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘పచ్చడి’ ఉగాది స్పెషల్. తీపి.. పులుపు.. కారం.. చేదు.. ఉప్పు.. వగరు సమ్మేళనం ఇది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేసుకునే షడ్రుచుల పానీయం.
దొప్పలే దోసిళ్లు
ఉగాదికి కొత్త జీవితం ప్రారంభమవుతుందనే ఉత్సాహం పెద్దలదైతే.. పచ్చడితో పండగ చేసుకోవచ్చని పిల్లల ఉల్లాసం. అప్పుడు పచ్చడిని గ్లాసుల్లో పోసేవారు కాదు. పరమాన్నం అయినా.. ప్రసాదం అయినా ఆకుల్లోనే ఇచ్చేవారు. ఉగాది పచ్చడి కోసం ప్రత్యేకంగా దొప్పలు కుట్టి వాటిలో పోసుకుని పచ్చడి తాగుతుండె. ఎక్కువగా మోదుగాకుల దొప్పలే ఉండేవి. మోదుగాకులు లేకపోతే మర్రి ఆకులతో ఈ దొప్పలను చేస్తుండె. కొత్త సంవత్సరం నాడు ఇలా కొత్త ఆకు దొప్పల్లో నానా రుచుల సమ్మేళనాన్ని నాలుక ఆస్వాదిస్తుంటే ఆ మాట వర్ణనకు అందేది కాదు.
కొత్త కుండలో పచ్చడి
నిజంగా మోదుగాకు దొప్పల్లో పచ్చడిని పోసుకొని ఆస్వాదిస్తుంటే మనసెంతో ఉల్లాసంగా ఉండేది. ఎవరికైనా దొప్పలు సరిపోకపోతే ‘గ్లాసులో పోసుకొని తాగు’ అని చెప్తే ‘చల్.. నాకు దొప్పల్లోనే కావాలె‘ అని మారం చేస్తుండె. ఇప్పుడైతే అన్నీ డిస్పోజల్ గ్లాసులు.. ప్లాస్టిక్ ప్లేట్లలోనే.. పచ్చడయినా.. పరమాన్నం అయినా. అప్పుడే కాతకు వచ్చిన మామిడి కాయలు.. కొత్త చింతపండు.. లేలేతగా కాసిన వేపపూత.. కొత్త బెల్లం.. తాజా కారం.. ఉప్పు మిశ్రమాన్ని కొత్తకుండలో పోసి.. బుద్ధి పుట్టినప్పుడల్లా ఓ లేతాకు డొప్పెడు పచ్చడి తాగుతుంటే ఎంత పసందుగా ఉండేదో కదా.?
భక్ష్యాల తీపి
ఉగాది పచ్చడికి ఎంత విశిష్టత ఉందో భక్ష్యాలకు అంతే విశిష్టత ఉంది. అమ్మ బక్ష్యాలకు పప్పు.. బెల్లంతో పూర్ణం చేస్తుంటే ఐదు నిమిషాలకోసారి వాళ్ల దగ్గరికి వెళ్లి ఓ ముద్ద పూర్ణం నోట్లో వేసుకుంటుండె. భక్ష్యాలు చెయ్యడం పూర్తిగాకముందే "అమ్మా ఒకటియ్యవా" అని ఆశగా అడిగితే "దేవుడికి పెట్టినంక ఇస్త ఆగురా జర" అని సముదాయిస్తుండె. పూర్ణం మిగిలితే దాంతోనే పప్పుచారు చేసేవాళ్లు. అదేందోగానీ ఒకట్రెండు భక్ష్యాలు తినగానే "అమ్మా ఇగ చాలే" అనిపిస్తుండె. కడుపు నిండా పచ్చడి తాగి.. దానిమీదికెళ్లి బక్ష్యాలు తిని బ్రేవ్ మనుకుంటూ సాయంత్రం అయ్యగారి దగ్గర పంచాంగం కోసం లైన్లు కట్టేవాళ్లు.
డొప్పల్లో ట్రై చేయండి
పచ్చడిలో తీపి.. పులుపు.. కారం.. చేదు.. ఉప్పు.. వగరు ఉన్నట్లే జవితంలో కూడా కష్టసుఖాలు.. ఆనందాలు.. కష్టాలు అన్నీ కలిసి ఉంటాయనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలోని వివిధ రుచులు.. అనుభవాలను సూచించే తాత్విక ప్రతీక ఈ ఉగాది పచ్చడి. జీవితంలో అన్ని రుచులను అంగీకరించాలని.. ఒక్కో రుచి ఒక్కో అనుభాన్ని ఇస్తుందని దీని అర్థం. ఉగాది రోజున పచ్చడిని తాగడం వల్ల కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. ఎలాంటి అనుభవం ఎదురైనా పాజిటివ్‌గా తీసుకోవాలని అంటారు పెద్దలు. సాంస్కృతిక.. ఆధ్యాత్మిక సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిని ఈసారి మోదుగు డొప్పల్లో ట్రై చేయండి.