EPFO: ఈపీఎఫ్‌లోకి మే నెలలో రికార్డు స్థాయిలో సభ్యుల చేరిక

by Harish |
EPFO: ఈపీఎఫ్‌లోకి మే నెలలో రికార్డు స్థాయిలో సభ్యుల చేరిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈపీఎఫ్‌లోకి చేరే ఖాతాదారుల సంఖ్య ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతుంది. తాజాగా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, మే 2024 లో రికార్డు స్థాయిలో 19.50 లక్షల మంది సభ్యులు చేరారు. ఇది మే 2023తో పోల్చితే 19.62 శాతం వృద్ధిని నమోదు చేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతంలో కంటే ఉపాధి అవకాశాలు పెరిగిపోవడం, ఈపీఎఫ్‌ ద్వారా కలిగే ప్రయోజనాలపై ఉద్యోగులకు అవగాహన పెరగడం, ఇతర ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం వంటి కారణాల వలన సభ్యులు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్తగా నమోదు చేసుకున్న సభ్యుల విషయానికి వస్తే, మే 2024లో దాదాపు 9.85 లక్షల మంది కొత్త సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇది ఏప్రిల్‌తో పోలిస్తే 10.96 శాతం పెరుగుదల, అదే 2023 ఏడాది మే నెలతో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల. కొత్తగా చేరిన సభ్యుల్లో 58.37 శాతం మంది దాదాపు 18-25 ఏళ్ల వయస్సు గల వారు. యువత అధికంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరడంతో వీరి వాటా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2.48 లక్షల మంది మహిళలు ఉన్నారు. మరోవైపు సుమారు 14.09 లక్షల మంది సభ్యులు ఎగ్జిట్ అయి, ఆ తర్వాత మళ్లీ ఈపీఎఫ్‌లో చేరారని డేటా పేర్కొంది. ఈ సభ్యులు తమ ఉద్యోగాలను మార్చుకుని తిరిగి ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే సంస్థల్లో చేరారు. మే నెలలో ఎక్కువగా నమోదైన ఖాతాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed