హైదరాబాద్‌లో రూ.25-50 లక్షల ధర కలిగిన ఇళ్లకు భారీ డిమాండ్

by Harish |
హైదరాబాద్‌లో రూ.25-50 లక్షల ధర కలిగిన ఇళ్లకు భారీ డిమాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో 2024 ఫిబ్రవరి నెలలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల(ఇళ్ల) రిజిస్ట్రేషన్లు భారీగా నమోదయ్యాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషించిన డేటా ప్రకారం, గత నెలలో హైదరాబాద్‌లో 6,938 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 21 శాతం ఎక్కువ. అలాగే వీటి మొత్తం విలువ రూ.4,247 కోట్లుగా ఉంది, ఇది ఏడాది ప్రాతిపదికన 42 శాతం, నెల ప్రాతిపదికన 29 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 15 శాతం ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరగ్గా, రంగారెడ్డిలో 5 శాతం, హైదరాబాద్‌‌లో 2 శాతం వృద్ధిని చవిచూశాయి.

లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర 10 శాతం వృద్ధిని సాధించింది. రూ. 25 - 50 లక్షల ధర కలిగిన ఇళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు డేటా చూపించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 45 శాతంగా ఉంది. రూ.25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా 14 శాతంగా నమోదైంది. రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా ఫిబ్రవరి 2023లో 10 శాతంతో పోలిస్తే, ఫిబ్రవరి 2024లో 14 శాతానికి పెరిగింది. లగ్జరీ కేటగిరీ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

1,000-2,000 చదరపు అడుగుల ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 71 శాతంగా ఉంది.1,000 చదరపు అడుగుల కంటే తక్కువ కలిగిన చిన్న ఇళ్లకు డిమాండ్ మధ్యస్థంగా ఉంది. ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్‌లు ఫిబ్రవరి 2023లో 20 శాతంగా నమోదవగా, ఫిబ్రవరి 2024లో 16 శాతానికి పడిపోయాయి. అదే సమయంలో 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ కేటగిరీ ఇళ్ల రిజిస్ట్రేషన్‌లు గత ఏడాది ఇదే నెలలో 10 శాతం ఉండగా, ప్రస్తుతం 13 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి 2024లో ప్రీమియం గృహాలకు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed