BSNL: 4G నెట్‌వర్క్ సిద్ధం.. పెరుగుతున్న యూజర్లు: కేంద్ర మంత్రి

by Harish |
BSNL: 4G నెట్‌వర్క్ సిద్ధం.. పెరుగుతున్న యూజర్లు: కేంద్ర మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ అందించడానికి సిద్ధంగా ఉందని మరికొన్ని నెలల్లో సేవలు అంతటా అందుబాటులోకి వస్తాయని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా శనివారం తెలిపారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, స్వదేశీ సాంకేతికతతో 4Gను రూపొందించాం. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయితే క్రమంగా బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా వచ్చిన డేటాను పరిశీలిస్తే, కొత్త సిమ్‌ల యాక్టివేట్ సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. అలాగే, 4G నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇంకా సింధియా మాట్లాడుతూ.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ 4G నెట్‌వర్క్‌ను విడుదల చేసినప్పుడు చాలా మంది అడిగారు, బీఎస్‌ఎన్ఎల్ ఎందుకు 4G ను తీసుకురాలేదని? అయితే ప్రభుత్వం చైనా లేదా మరే ఇతర పరికరాలను ఉపయోగించకుండా సొంతంగా స్వదేశీ సాంకేతికతతో 4G రూపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది. అయితే సొంత 4G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఒకటిన్నర ఏళ్లు పట్టింది. అందుకే ఆలస్యంగా సేవలను అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం టవర్ల ఏర్పాటు జరుగుతుంది. బీఎస్‌ఎన్ఎల్ 4G నెట్‌వర్క్ కోసం తేజస్ నెట్‌వర్క్, సి-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్లను, వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, అంటే మార్చి 2025 నాటికి లక్ష టవర్ల 4G నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ టవర్లను 5Gకి కోసం కూడా వాడుకోవచ్చని, దానికి సంబంధించిన అప్‌గ్రేడ్ పనులు జరుగుతున్నాయని సింధియా తెలిపారు.

Advertisement

Next Story