- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడే మధ్యంతర బడ్జెట్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ ఉంటుంది. నిర్మలా సీతారామన్‌కు ఇది ఆరవ బడ్జెట్ కాగా, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్. తాత్కాలిక బడ్జెట్‌లో అన్ని వర్గాలను సంతృప్తి పరిచే నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9 గం.లకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుని, అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గం.లకు రాష్ట్రపతి నుంచి బడ్జెట్ సమర్పణకు కావాల్సిన అనుమతి తీసుకుంటారు. ఉదయం 10 గం.లకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి, ఆర్ధిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి పార్లమెంటు వద్దకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గం.లకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటి జరుగుతుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 11.05 గం.ల నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీ..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌తో పాటు రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ-కశ్మీర్ వార్షిక పద్దును కూడా ప్రవేశపెడతారు. ఇదే సమయంలో గతేడాది తరహాలోనే ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను తీసుకురానున్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపిస్తారు.
యాప్‌లో బడ్జెట్ వివరాలు..
ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన సమాచారం మొత్తం సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా 'యూనియన్ బడ్జెట్' అనే యాప్, ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్, సైట్‌లో పీడీఎఫ్ రూపంలో బడ్జెట్ వివరాలు, ఆర్థిక మంత్రి ప్రసంగం, కేటాయింపులు, ఫైనాన్స్ బిల్లులు, డిమాండ్ ఫర్ గ్రాండ్స్ సహా మొత్తం బడ్జెట్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఉంచుతారు.
2023లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను కేంద్రం ప్రధానంగా 'అమృత్ కాల్ 'లో మొదటి బడ్జెట్‌గా పేర్కొంది. ఇది కొత్త ఉద్యోగాల సృష్టి, వృద్ధిని పెంచేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే, మూలధన వ్యయాన్ని పెంచి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకోవడం లక్ష్యంగా నిర్దేశించింది.
బడ్జెట్-2024 అంచనాలు..
ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'దిశ-నిర్దేశక్ బాతే(దిశ-నిర్దేశక సంభాషణలు)' పేరున బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎన్నికల ఏడాది కావడంతో ప్రధానంగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను కొనసాగించడం, మహిళలు, రైతులు, పేదలు, యువత వంటి కీలక రంగాలపై దృష్టి సారించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా దేశం ప్రతిరోజూ పురోగమిస్తూ వృద్ధిలో కొత్త శిఖరాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న వేళ ఈ రంగాల వారికి ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలను ప్రకటించాలని భావిస్తున్నారు.
అలాగే, ఎంఎస్ఎంఈకి సంబంధించి నియంత్రణ విధానాలు, రుణాలు, ఆర్థిక సాయం వంటి చర్యలు ఉండాలని కోరుతున్నారు. వేతనజీవులు ఆదాయ పన్ను శ్లాబ్‌లలో సవరణలు, ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం ఉన్న రూ. 50 వేలను, కొత్త, పాత పన్ను విధానాల్లో రూ.లక్షకు పెంచాలనే డిమాండ్ గట్టిగా ఉంది. అదేవిధంగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు.
మధ్యతరగతి ప్రజలు ఉపాధి అవకాశాలను పెంచే విధానాల కోసం ఎదురుచూస్తున్నారు. గృహ పథకాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పెంచే నిర్ణయాలు అవసరమని కోరుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు మరిన్ని నిధులు కేటాయించడంపై దృష్టి పెట్టాలని, పరిశ్రమలకు సహకారం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలతో రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
ఆర్థిక సర్వే లేదు..
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండవ దశ చివరి బడ్జెట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఏడాది ఆర్థిక సర్వే ప్రవేశపెట్టలేదు. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రధాన ఆర్థిక సలహాదారు సాంప్రదాయకంగా సమర్పించే ఈ ఆర్థిక సర్వే ఈసారి బడ్జెట్ ప్రకటనలతో పాటు లేదు. బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటు సంప్రదాయం ప్రకారం, పూర్తిస్థాయి బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే, మధ్యంతర లేదా తాత్కాలిక బడ్జెట్‌కు ముందు ఇది తప్పనిసరి కాదు. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టబోయే ప్రభుత్వమే పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది.
Read More..
సీఎం రేవంత్ రెడ్డిని ఆ నలుగురు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు: కేఎ పాల్