వారికి కన్నీళ్లు మిగిల్చారు.. కేసీఆర్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

by Shyam |
BSP leader RS ​​Praveen Kumar
X

దిశ, జడ్చర్ల: బహుజనుల్లో చైతన్యం వస్తేనే రాజ్యాధికారం సాధించుకోవడం సులభం అవుతుందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్ణణంలో నిర్వహించిన బీసీ చైతన్య యాత్ర ముగింపు సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ చేపట్టిన ఈ చైతన్య యాత్ర ముగింపు కాదని, ప్రారంభం అని అన్నారు. ఇలాంటి చైతన్య యాత్రలు రాష్ట్రంలో మరిన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా బహుజనుల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.30 వేలు సంపాదించాల్సిన బహుజనులు, పోలేపల్లి సెజ్ కారణంగా కనీసం రూ.10 వేలు కూడా సంపాదించలేక బతుకీడుస్తు్న్నారని ఆవేదన చెందారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల విధానం ఒక్కటేనని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఒకరికి నీరు, మరొకరికి కన్నీరు అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారని మండిపడ్డారు. కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు దండుకొని, పేద, బహుజనులకు కనీళ్లు మిగిల్చారని అన్నారు. టీఆర్ఎస్ పాలిస్తున్న తీరు సహించరానిదని తెలిపారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరోసారి బీసీ జనగనణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. బీసీ జనగణన లెక్కలు దాచిపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలిపారు. దీనిపై ఊరూరా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెంకటస్వామి, బాలవర్ధన్ గౌడ్, రాంచంద్రయ్య, బాలరాజు, జగన్, సత్యానారాయణ తదితరులు ఉన్నారు. కాగా, జడ్చర్ల నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 22 రోజుల పాటు కొనసాగిన బీసీ చైతన్య యాత్ర సోమవారంతో ముగిసిందని బీసీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story