కరోనా వచ్చినా వాళ్లు చనిపోరు.. బ్రెజిల్ అధ్యక్షుడి విచిత్ర వ్యాఖ్యలు

by vinod kumar |
కరోనా వచ్చినా వాళ్లు చనిపోరు.. బ్రెజిల్ అధ్యక్షుడి విచిత్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆయనకు జతగా బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో చేరిపోయారు. ప్రపంచమంతా కరోనా వైరస్ సంక్షోభంతో కూరుకొని పోయిన సమయంలో ఫుట్‌బాల్ క్రీడాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినా… వాళ్లు చనిపోయే అవకాశాలు తక్కువని.. వాళ్లు అథ్లెట్లు కాబట్టి శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు. వారికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే కాబట్టి ఇక ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా క్రీడలు స్తంభించిపోవడంతో ఆటగాళ్లు నిరుద్యోగులుగా మారిపోయారని అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. వారికి ఆదాయం వచ్చే మార్గం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని.. వీరిలో చాలా మంది తిరిగి ఆటలు ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. ఆ దేశంలో అత్యంత ఆదరణ పొందిన బ్రెజీలియన్ ఛాంపియన్‌షిప్ ఈ నెలలో ప్రారంభం కావల్సి ఉంది. కరోనా నేపథ్యంలో టోర్నీని రద్దు చేయాలని నిర్వాహకులు భావిస్తుండగా.. అధ్యక్షుడు జేర్ బోల్పోనారో మాత్రం పై విధంగా స్పందించారు. ప్రేక్షకులు లేకుండా ఆట ఆడితే క్రీడాకారులకు కరోనా రాదని.. ఒక వేళ వచ్చినా వారి ప్రాణాలకు ప్రమాదం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు స్పందించాయి. సావో పౌలో ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్, బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు రాయ్ కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసలు కరోనాను ‘లిటిల్ ఫ్లూ’ అని చెబుతూ, కట్టడి చేయడంలో విఫలమైన అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Tags : Brazil, President, Jair Bolsonaro, Sao Paulo, Football, Brazilia Championship, Coronavirus

Advertisement

Next Story