ట్విట్టర్ నిషేధించాలంటూ ట్విట్టర్‌లోనే ట్రెండింగ్!

by Shamantha N |
ట్విట్టర్ నిషేధించాలంటూ ట్విట్టర్‌లోనే ట్రెండింగ్!
X

సమాజంలో ఏదైనా విషయం నచ్చకపోతే దాని గురించి సోషల్ మీడియా వేదిక హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేసి నిరసన తెలియజేయడం ఈ జనరేషన్‌కు అలవాటే. వాటిలో ప్రధానంగా ఎక్కువ మంది సెలెబ్రిటీలు, రాజకీయనాయకులు, ప్రముఖులు ఉండే ట్విట్టర్‌నే ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు నెటిజన్లకు ట్విట్టర్ మీదే కోపం వచ్చింది. దాన్ని నిషేధించాలంటూ దాన్నే వేదికగా చేసుకుని నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకోసం ‘బాయ్‌కాట్ ట్విట్టర్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. వినడానికి విడ్డూరంగానే ఉన్నా, దీని వెనక కారణం తెలిస్తే ప్రతి భారతీయుడు ‘బాయ్‌కాట్ ట్విట్టర్’ అంటాడు. ఇంతకీ ఏం జరిగిందంటే…

పాల ఉత్పత్తులు తయారుచేసే అమూల్ కంపెనీ అందరికీ తెలిసిందే. అమూల్ బేబీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి సమాజంలో వాస్తవాలను అమూల్ బేబీ కార్టూన్ల రూపంలో ఆ సంస్థ.. పేపర్లలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. ఇటీవల చైనా ఉత్పత్తుల వాడకాన్ని భారత్‌లో నిషేధించాలని ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు కదా.. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ద డ్రాగన్ (డ్రాగన్‌ని వెళ్లగొట్టండి) అని చెబుతూ అమూల్ సంస్థ ఒక అమూల్ బేబీ కార్టూన్‌ను ట్విట్టర్‌లో జూన్ 3న పోస్టు చేసింది. ఆ పోస్టు చేసిన తర్వాత జూన్ 4వ తేదీన సాయంత్రానికి అమూల్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో నెటిజన్లకు కోపం వచ్చి, ఈ పని చేసింది ట్విట్టర్ కాబట్టి, చైనాకు మద్దతిస్తోందని భావించి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ విషయం గురించి ట్విట్టర్‌కి ఎలాంటి సంబంధం లేదని అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధీ వివరణ ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తమ వైపు నుంచే ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయిందని, దాని గురించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ హ్యాష్‌ట్యాగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed