అమ్మాయి కోసం భయపడి.. ప్రాణం తీసుకున్నాడు

by Sumithra |   ( Updated:2021-06-28 02:19:53.0  )
srinath 1
X

దిశ, కామారెడ్డి : ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదో అనే భయంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన కర్ణాల శ్రీనాథ్(20) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె విషయంలో శ్రీనాథ్ కొంతకాలంగా మనఃశాంతిని కోల్పోతున్నాడు.

అమ్మాయి విషయమై శ్రీనాథ్ ఇంట్లో తరచూ బాధపడుతున్న విషయాన్ని గమనించిన తండ్రి జగదీష్.. రెండు నెలల కిందట ప్రశాంతంగా ఉంటాడని సిద్దాపూర్ గ్రామంలో ఉంటున్న మేనత్త వద్దకు పంపించాడు. అక్కడ కూడా మనోవేదనకు గురైన శ్రీనాథ్ గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story