- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపు.. బొమ్మెరకు ఈ సారైనా కలిసొచ్చేనా?
దిశ, ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో ఈసారైనా తమకు అవకాశం కల్పించాలని ఎంతోమంది ఆశావాహులు ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఏ పదవి లేకుండా కేవలం పార్టీ కోసం పనిచేసేవారు ఈ సారి ఎలాగైనా తమకు గుర్తింపు ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. అలాంటి వారే బొమ్మెర రామ్మూర్తి. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తనవంతుగా ఆయన ఎంతో కృషి చేశారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందునుంచే తెలంగాణ కావాలంటూ తన గళం వినిపించారు. ఆంధ్రా పెత్తనం ఉన్న ఖమ్మం జిల్లాలో తన ఆకాంక్షను బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఉద్యమంలో భాగంగా ఎన్నోసార్లు కేసుల పాలయ్యారు.. ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరి.. నరనరాన జీర్ణించుకున్న తెలంగాణ వాదాన్ని ఆంధ్రా పెత్తనం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా విస్తరింపచేశారు. ఇంత చేసినా ఇప్పటి వరకు ఏ పదవి ఆశించలేదు. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు బొమ్మెర. పార్టీలో సైతం ఎంతో నమ్మకంగా పనిచేస్తూ పార్టీ ఎదుగుదలకు కృషి చేశానని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సముచిత స్థానం కల్పిస్తామని ఎన్నో సార్లు హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు.
ఒకే ఒక్కడిగా మొదలై…
తెలంగాణ ఏర్పడక ముందు ఖమ్మం జిల్లా అంటేనే ఆంధ్రా కల్చర్. అందులో మధిర నియోజకవర్గంలో మరీ ఎక్కువ. తెలంగాణ అని ఎవరూ నోరు మెదపడానికి కూడా సాహసించేవారు కాదు. అలాంటిది మొదట బొమ్మెర రామ్మూర్తి ఒక్కడే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారు. తర్వాత ఆయనతో కొంతమంది యువకులు జతకూడడంతో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీకి సైతం ఎంతో సేవ చేశారు. కార్యకర్తలెవరూ లేని సమయంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా పార్టీ తరపున స్పందించేవాడు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ సైతం బొమ్మెర రామ్మూర్తి గురించి ‘ఉద్యమం నుంచి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ ఇప్పటి వరకు ఏ పదవీ లేని మనిషంటూ’ పలు వేదికల మీద గుర్తుచేసేవారు.
టీఆర్ఎస్ పార్టీలో..
బొమ్మెర రామ్మూర్తి మొదట విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో హైదరాబాద్ జిల్లా TRSV వ్యవస్థాపక అధ్యక్షుడిగా, 2004లో పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2007లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2011లో ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గ ఇన్‌ఛార్జిగా నియమించబడ్డారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి భట్టి విక్రమార్కపై ఓడిపోయారు. ఉద్యమ కాలంలో ఈయనపై 96 కేసులు నమోదయ్యాయి. 12 సార్లు జైలుకి వెళ్లాడు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన బొమ్మెర ఈసారైనా తనకు అవకాశం కల్పించాలని వేడుకోలు.
అవకాశం కల్పించాలని వేడుకోలు
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పార్టీ పటిష్టత కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చుచేశారు. సుమారు 7 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవిలేని బొమ్మెర రామ్మూర్తి తన సేవలను గుర్తించాలని, సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ ను వేడుకుంటున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, పదవి కేటాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా మధిర నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట మరింత పెంచుతానని విజ్ఞప్తి చేస్తున్నారు. స్వయంగా మంత్రి అజయ్ ఇటీవల బొమ్మెరను తన కుటుంబంతో తీసుకెళ్లి యువనేత, మంత్రి కేటీఆర్ ను కలిపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ పటిష్టత కోసం ఏండ్లుగా కృషి చేస్తున్న తనకు ఈసారైనా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని రామ్మూర్తి కేటీఆర్ ను వేడుకున్నారు. లేకుంటే రాష్ట్ర స్థాయి ఏదైనా చైర్మన్ పదవైనా ఇవ్వాలనే కోరారు.