జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా : అజయ్ దేవ్‌గన్

by Anukaran |   ( Updated:2020-08-05 04:18:04.0  )
జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా : అజయ్ దేవ్‌గన్
X

పదహారేళ్ల ప్రాయంలోనే.. సినీ జీవితాన్ని ప్రారంభించింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్. తొలి సినిమా పరాజయం పాలైనా.. ‘బాజీగర్’ సినిమాతో తన సత్తా చాటింది. దాంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అందం, అభినయంతో బాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. 1995లో కాజోల్ నటించిన ‘కరణ్ అర్జున్, దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో తన పేరు మార్మోగిపోయింది. ఇక కాజోల్‌కు కెరీర్‌లో వెనుదిరిగి చూసుకొనే అవకాశమే రాలేదు. ‘గుండారాజ్’లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగన్‌తో ప్రేమ చిగురించగా.. వీరి ప్రేమాయణం ఐదేళ్లపాటు సాగింది. చివరకు వీరిద్దరూ 1999 ఫిబ్రవరి 24న మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ రోజు కాజోల్ 46వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అజయ్ దేవగన్‌.. తన శ్రీమతికి స్పెషల్ విషెస్ తెలిపాడు.

‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన అజయ్ దేవ్‌గన్.. విష్‌తో పాటు కాజోల్ చేయి పట్టుకుని ఉన్న ఓ ఫొటోను షేర్ చేశాడు. కాగా అజయ్‌తో పాటు ప్రముఖులు, అభిమానులు కాజోల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక కాజోల్.. పెళ్లి తర్వాత కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. ఎక్కువగా కథా ప్రాధాన్యత గల చిత్రాలు లేదా అతిథి పాత్రలకే పరిమితమైంది. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ విషయంలో కాజోల్‌కు ‘కర్మవీర్’ పురస్కారం కూడా లభించింది.

https://www.instagram.com/p/CDfr81qJaIB/

Advertisement

Next Story