యూఎస్‌లో మరో ‘జార్జ్ ఫ్లాయిడ్’ ఘటన

by vinod kumar |
యూఎస్‌లో మరో ‘జార్జ్ ఫ్లాయిడ్’ ఘటన
X

వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అట్టుడుకుతున్న అమెరికాలో మరో నల్లజాతీయుడిని ఓ పోలీసు అధికారి తుపాకీతో కాల్చారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన అట్లాంటాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అట్లాంటలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

అట్లాంటాలోని వెండీ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ దగ్గర 27 ఏళ్ల రేషార్డ్ బ్రూక్ తన కారులో పడుకుని ఉన్నాడు. ఆయన తమ కస్టమర్లకు ఆటంకం కలిగిస్తున్నాడని సదరు రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు యత్నించారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఓ పోలీసు దగ్గర నుంచి ఓ ఆయుధాన్ని లాక్కుని బ్రూక్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటవస్తున్న ఓ పోలీసు అధికారిని బెదిరించాడు.

తర్వాత ఓ పోలీసు అధికారి బ్రూక్‌పైకి కాల్పులు జరపగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సర్జరీ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బ్రూక్ మరణించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే అట్లాంటా పోలీసు చీఫ్ ఎరికా షీల్డ్ రాజీనామా చేశారు. బ్రూక్ మరణంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు అంతర్రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. వెండీ రెస్టారెంట్‌కు నిప్పంటించారు.

Advertisement

Next Story

Most Viewed