ఏపీలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్?

by Anukaran |
ఏపీలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్?
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌‌లో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టిందా? అన్న అనుమానాలు రాష్ట్ర రాజకీయాల్లో వినివిస్తుంది. బీజేపీకి దక్షిణాదిలో పాగావేయాలన్నది దశాబ్దాలుగా నెరవేరని కల. కర్ణాటక మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నామరూపాల్లేవు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే ఆ పార్టీని ఏలుతున్నారు. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలు, పార్క్ హయాత్ హోటల్‌లో జరిగిన ఓ భేటీతో వెలుగులోకి రావడంతో పార్టీ హైకమాండ్ షాక్ తిన్నట్టు తెలుస్తోంది.

వైఎస్సార్సీపీ 151 సీట్లతో ఏపీలో అధికారం చేజిక్కించుకుంది. దీంతో జగన్ స్కెచ్ వేస్తే ఎలాంటి వాడైనా మట్టికరవాల్సిదేనన్నది ఆ పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు ఉన్న నమ్మకం. అలాంటి జగన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొరకరాని కొయ్యగా మారారు. జగన్ ఎన్ని వ్యూహాలు రచించినా చిక్కకుండా చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. దీంతో నిమ్మగడ్డపై కదలికలపై వైఎస్సార్సీపీ నిఘా వేసింది. దీంతో హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన భేటీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దీంతో ఆ ముగ్గురి కదలికల రికార్డులను వైఎస్సార్సీపీ తెరిచి చూడగా షాకింగ్ విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది.

నిమ్మగడ్డని ఎక్కడైతే సుజానా చౌదరి కలిశారో అక్కడే.. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అంటే పది రోజుల వ్యవధిలో 15 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కలిసినట్టు సీసీ టీవీ పుటేజీ నిర్ధారించింది. దీంతో వైఎస్సార్సీపీకి షాక్‌ తగిలింది. వీరిలో గత కొంత కాలంగా పార్టీలోని నేతలు, పార్టీ పనితీరుపై గుర్రుగా ఉండి, బహిరంగ విమర్శలు చేస్తున్న పలువురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సుజనాని కలిసిన వైఎస్సార్సీపీ నేతలెవరు? ఏ రోజు, ఎన్నిగంటలకు కలిశారన్నదానిపై నిఘా వర్గాలు సీల్డ్ కవర్‌లో వివరాలందించారు.

దీంతోనే ఆపరేషన్ ఏపీని బీజేపీ మొదలు పెట్టిందా? సుజనాను కలిసిన నేతలంతా పార్టీ మారుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి చెందిన సీనియర్ నేతలు వైఎస్సార్సీపీకి సన్నిహితంగా మారారన్న నేపథ్యంలో కొత్తగా పార్టీలో చేరిన వారితో అంటే యువరక్తంతో బీజేపీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉందని తెలుస్తోంది. పార్టీలో తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న బృందాన్ని ఐక్యం చెయ్యడం వారికి కాషాయం కండువా కప్పడమే బిజెపి వ్యూహం అని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నప్పుడు ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. సీసీ పుటేజీ బయటపడడంతో సుజనాను కలిసిన వారందరిపై నిఘా పెట్టారు.

Advertisement

Next Story