కాంగ్రెస్‌లో భయం.. బీజేపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్?

by Shyam |   ( Updated:2021-03-17 07:12:30.0  )
కాంగ్రెస్‌లో భయం.. బీజేపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళుతుండగా.. అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా తమ రాజకీయ వ్యూహలకు మరింత పదును పెట్టింది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు మరోసారి తెరలేపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోని వీలైనంత మంది కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ చర్చలు జరుపుతోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో బీజేపీ చర్చలు జరపగా.. ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాను వేరే పార్టీలో చేరాలా?..కొత్త పార్టీ పెట్టాలా? అనే మీమాంసలో ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలతో చర్చించి మూడు నెలల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని కొండా విశ్వశ్వరరెడ్డి చెబుతున్నారు. కొత్త పార్టీ పెట్టకపోతే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.

ఇక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బీజేపీ గాలం వేసింది. కోమటిరెడ్డి ఫ్యామిలీకి తెలంగాణలో క్రేజ్ ఉంది. రాజగోపాల్ రెడ్డి వస్తే.. కాంగ్రెస్ నుంచి మరికొంతమంది నేతలు కూడా తమ పార్టీలోకి వచ్చే అవకాశముందని బీజేపీ భావిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ఎప్పటినుంచో వార్తలొస్తుండగా.. తాజాగా ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తనను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తుందని, పోటీ చేయాల్సిందిగా తనను సంప్రదించిందంటూ రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బీజేపీలో చేరడంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌పై నమ్మకం పోయిందని, టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలంటే బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే వార్తలొస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకి తగ్గిపోతోంది. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని భావించి చాలామంది నేతలు వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎంతమంది నేతలు తమ పార్టీ నుంచి వెళ్లిపోతారోనని కాంగ్రెస్‌కు భయం పెట్టుకుంది. మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుందో.. లేదో? చూడాలి.

Advertisement

Next Story