బీజేపీ అలా అనలేదే : రాహుల్ గాంధీ

by Shamantha N |   ( Updated:2021-04-14 20:57:17.0  )
బీజేపీ అలా అనలేదే : రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ : పదే పదే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని పిలుపునిచ్చే బీజేపీ ‘తృణమూల్ ముక్త్ భారత్’ అని ఎప్పుడూ అనలేదేం..? అని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర్ దినాజ్‌పూర్‌లో జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ పోరే గానీ సిద్ధాంతపరంగా ఆ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. బీజేపీ ఎప్పుడూ తృణమూల్ ముక్త్ భారత్ అని చెప్పలేదని తెలిపారు. తమది బీజేపీతో సిద్ధాంతపరమైన వైరుధ్యమని వివరించారు. మమతా, బీజేపీ మాజీ మిత్రులని గుర్తు చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదేళ్లలో బెంగాల్‌కు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ‘మీరు టీఎంసీకి రెండు సార్లు అవకాశమిచ్చారు. మీ అంచనాలను అందుకోవడంలో టీఎంసీ దారుణంగా విఫలమైంది. మమతా బెనర్జీ రోడ్లు నిర్మించారా.? కాలేజీలు కట్టారా..? ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగం రావాలంటే లంచాలు (కట్ మనీని ఉద్దేశిస్తూ) ఇచ్చుకోవాల్సిందే’ అని విమర్శించారు.

బీజేపీపైనా రాహుల్ మండిపడ్డారు. బీజేపీ నాయకులు ఏ రాష్ట్రంలోకెళ్తే అక్కడి పాట పాడతారని ఎద్దేవా చేశారు. ‘ప్రతి రాష్ట్రంలోనూ వాళ్లు అలాగే చేస్తారు. బెంగాల్‌ను సువర్ణ బంగ్లా (సోనార్ బంగ్లా) చేస్తామంటున్నారు. కానీ ఇక్కడి ప్రజలను కుల, మతాల పేరు మీద విభజిస్తున్నారు. విద్వేషాన్ని, విభజనవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారు అధికారంలో లేని చోట స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుని అక్కడా ఇదే విధ్వంసం సృష్టిస్తున్నారు’ అని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీపైనా రాహుల్ విమర్శల వర్షం కురిపించారు. కరోనా కట్టడి లో ప్రధాని దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. కరోనాను అరికట్టాల్సింది పోయి ప్రజలను దీపాలు, సెల్‌ఫోన్ లైట్లు వెలిగించమని చెప్పారని, వలస కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వారిని గంటలు మోగించమని చెప్పారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story