హుజురాబాద్ ‘లైట్’.. ఈటలకు దిమ్మతిరిగే షాకిచ్చిన తెలంగాణ బీజేపీ

by Anukaran |   ( Updated:2021-08-12 00:28:54.0  )
హుజురాబాద్ ‘లైట్’.. ఈటలకు దిమ్మతిరిగే షాకిచ్చిన తెలంగాణ బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం మొత్తం హుజురాబాద్​నియోజకవర్గంపై కన్నేసింది. సీఎం కేసీఆర్​ నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం హుజురాబాద్‌లో పాగా వేస్తే.. బీజేపీ నేతలు మాత్రం బండి సంజయ్ పాదయాత్ర పనుల్లో పడ్డారు. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు హుజురాబాద్ గల్లీల్లో తిరుగుతున్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ సైతం పర్యటిస్తున్నారు. ఇదే సెగ్మెంట్‌లో సీఎం పర్యటన మూడుసార్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడి నుంచే కొత్త కొత్త పథకాలు పురుడుపోసుకుంటున్నాయి. అక్కడి నేతలకు పదవులు ఇస్తున్నారు. ఇదంతా కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే అనేది రాష్ట్రమంతా చర్చించుకుంటున్న విషయమే. మరోవైపు టీఆర్‌ఎస్​ ట్రబుల్​ షూటర్‌ను రంగంలోకి దింపింది. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికను బీజేపీ మాత్రం లైట్ తీసుకుంటోంది. అసలు పార్టీకి సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలుపెట్టినా అనారోగ్య కారణాలతో ఆగిపోయింది. అక్కడి నుంచే బీజేపీ శ్రేణులు దాన్ని కొనసాగిస్తారని భావించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అసలు అటు వైపు వెళ్లేవారు కనిపించడం లేదు.

కిషన్​రెడ్డి ఆశీర్వాద యాత్ర.. బండి పాదయాత్ర

బీజేపీ అధిష్టానం నిర్ణయంతో కేంద్రమంత్రి జన ఆశీర్వాద్ యాత్ర ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో చేపట్టుతున్నా.. అది హుజురాబాద్​వైపు వెళ్లడం లేదు. ఈ నెల16న సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. 17న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్, నర్సంపేట, ములుగు నుంచి రామప్ప గుడికి వెళ్లి రాత్రి వరంగల్‌లో బస చేస్తారు. ఇక్కడి నుంచి హుజురాబాద్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. కిషన్​రెడ్డి మాత్రం 18న ఉదయం జనగామ, యాదగిరిగుట్ట, భువనగిరి, ఘట్‌కేసర్, ఉప్పల్​వైపు యాత్ర ప్లాన్​ చేశారు. 19, 20వ తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యాత్ర ఉంటుంది. అంతేకానీ వరంగల్​ వరకు వెళ్లనున్న కిషన్​రెడ్డి.. హుజురాబాద్​వైపు మాత్రం వెళ్లడం లేదు.

ఎటు వెళ్దాం..?

ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలకు ముందున్న అతిపెద్ద సవాల్​ఇదే కానుంది. బండి పాదయాత్రకు వెళ్లడమా.. హుజురాబాద్‌లో ఉండటమా.. అనేది తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ​దృష్టిలో ఉండాలంటే పాదయాత్రలో వెన్నంటి నడువడమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడో, అప్పుడో హుజురాబాద్​ ఉప ఎన్నికకు షెడ్యూల్​ జారీ అవుతుందని బీజేపీలోనే ప్రచారం జరుగుతుండగా.. కీలకమైన సమయంలో బండి సంజయ్ ​పాదయాత్రకు దిగుతున్నారు. అంతేకాదు.. ఏకంగా 220 మందితో పాదయాత్ర ఇన్‌చార్జీలను ప్రకటించారు. ఈ లెక్కన 220 మంది నాయకులు హుజురాబాద్‌కు వెళ్లరని స్పష్టమవుతూనే ఉంది. ఉన్నవారిలో కీలక నేతలకు బండి పాదయాత్ర బాధ్యతలను అప్పగిస్తే.. ఇక ఉప ఎన్నిక ప్రాంతానికి వెళ్లేదెవరనేది బీజేపీ నేతలను వేధిస్తున్న ప్రశ్న.

ఊపు కాదు.. ఊసే లేదు

రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్‌లో గట్టి​పోటీ ఇచ్చిన తర్వాత బీజేపీని ప్రత్యమ్నాయంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే సమయంలోనూ అధిష్టానం దగ్గర బండి సంజయ్​ జోరు పెరిగింది. కానీ, ఆ తర్వాత మండలి ఎన్నికలు, నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల్లో ఘోర వైఫల్యాలను మూటగట్టుకుంది. దీన్ని అధిష్టానం దగ్గర ఒక వర్గం సంజయ్ ​ఫెయిల్యూర్‌గా చూపించినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో హుజురాబాద్‎లో ఈటల గెలుపుతో మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉందనుకున్న సమయంలో పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు.

హుజురాబాద్​ సెగ్మెంట్‌లో ఈటల పాదయాత్రలో గానీ, నియోజకవర్గంలో గానీ ఆ నేతలు పెద్దగా పాల్గొనడం లేదు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్‌రెడ్డి ఇప్పటివరకూ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల కారణాన్ని చూపి అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రను ముందేసుకుంటున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన బీజేపీ జాతీయ నేత మురళీధర్​రావు ఒక్కసారి వచ్చి వెళ్లారు. బీజేపీ సీనియర్​ నేతలు విద్యాసాగర్​రావు, రఘునందన్​రావుతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్​ యాక్టివ్‌‌గా ఉండటం లేదు. డీకే అరుణ, కె లక్ష్మణ్​ వంటి నేతలు కనిపించడమే లేదు. దీంతో సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణ స్పష్టంగా కనిపిస్తోంది.

అధికార పార్టీ మకాం అక్కడే

మరోవైపు గులాబీ అధిష్టానం మొత్తం హుజురాబాద్​ వైపే వెళ్లింది. ఇప్పటి వరకు మంత్రులు పలుమార్లు పర్యటించగా.. టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్​రావు గురువారం నుంచి పర్యటన మొదలుపెట్టారు. ఇక నుంచి రోజువారీగా అదే సెగ్మెంట్‌లో ఉంటానంటూ చెప్పుకుంటున్నారు. దీనికితోడుగా టీఆర్‌ఎస్ ​బీసీ కార్డును చూపిస్తూ హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్​ యాదవ్‌ను పోటీకి దింపుతోంది. విద్యార్థి ఉద్యమనేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్​ ఇస్తే గట్టిగా తిప్పికొట్టాలని చూస్తున్న బీజేపీకి కేసీఆర్​చెక్​పెట్టినట్టే. ప్రస్తుతం ఉద్యమ నేతగా, విద్యావంతుడు, బీసీ వర్గానికి చెందిన నేతగా గెల్లును విమర్శించేందుకు పదునైన ఆయుధాలు బీజేపీకి లేనట్టే. అల్రెడీ హరీశ్​రావు ఇదే అంశంపై ప్రచారం కూడా మొదలుపెట్టారు. విద్యార్థి ఉద్యమ నేత, అవినీతి మరకలేని నాయకుడు అంటూ చెప్పుకొస్తున్నారు.

పరిస్థితి చేజారుతోందా..?

ఇక హుజురాబాద్‌లో ఈటలకు పరిస్థితి చేజారుతుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దీనికితోడుగా సెగ్మెంట్‌కు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌కు వెళ్లారు. బీజేపీని ఒక పార్టీగా వాడుకోడానికి బదులు ఈటల తన స్వంత అస్తిత్వం కోసమే పాకులాడుతున్నారని, దానికి బలం చేకూర్చేలా పార్టీ సీనియర్ నేతల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదంటున్నారు. ఇదే సమయంలో అధికార గులాబీ పార్టీ మొత్తం అక్కడే కేంద్రీకృతమైతే.. బీజేపీ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా తీసుకుంటోంది. ఈటలకు ఇప్పుడు బీజేపీ గుర్తు అయిన కమలం గుర్తు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ఎక్కడా కనిపించడం లేదు. కేసీఆర్, కేటీఆర్ వ్యూహాలు, నియోజకవర్గంలో మంత్రుల ప్రచారాలు, హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ చేస్తున్న రాజకీయాలు.. ఇదే సమయంలో బీజేపీ సైలెంట్‌గా మారడంతో హుజురాబాద్‌లో ఈటలకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.

Advertisement

Next Story