ఈటల అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

by Sridhar Babu |
ఈటల అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..
X

దిశ, హుజురాబాద్ : ఈటల రాజేందర్ అంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ ఆరోపించారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధనే లక్ష్యం అన్న కేసీఆర్, తన కుటుంబం నుండి రాజకీయాల్లోకి ఎవరూ రారని చెప్పిన ఆయన కొడుక్కు, కూతురుకు పదవులు కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో ఉద్యమ నాయకుల గొంతులను కేసీఆర్ నొక్కేస్తున్నారని విమర్శించారు. గులాబీ పార్టీలో మేము ఓనర్లమే అని ఈటల ఒక సందర్భంలో చెప్పారన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి ఈటలను భర్తరఫ్ చేశారని అన్నారు. హుజురాబాద్‌కు వస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈటలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత పార్టీ నాయకులనే డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ కొంటున్నదని ఆరోపించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో దందా చేసి సీఎం కేసీఆర్ లక్షల కోట్లు దండుకున్నారని.. హుజూర్ నగర్, నాగార్జునసాగర్‌లో నిధులు ఇస్తామని ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ అంటే కేసీఆర్‌కు భయం పట్టిందన్నారు. హుజురాబాద్‌లో ప్రజాప్రతినిధులను కొనడానికి ఇప్పటికే రూ.70 కోట్లు ఖర్చు చేశారన్నారు. అధికారం, అహంకారంతో ఎవరినైనా కొనగలం అనే భ్రమలో కేసీఆర్ ఉన్నారన్నారు. ఈటలపై ఈ నియోజకవర్గ ప్రజలకు అమితమైన ప్రేమ ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు వందల కోట్లు ఎక్కడివనే చర్చ ప్రజల్లో జరుగుతుందన్నారు. హుజురాబాద్‌లో ఓటమి భయంతోనే సంగమేశ్వర ప్రాజెక్టు విషయాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గజ మోసగాడన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Advertisement

Next Story

Most Viewed