పైలాన్‌లో కేసీఆర్ బొమ్మెందీ..?

by Shyam |
పైలాన్‌లో కేసీఆర్ బొమ్మెందీ..?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఆవ‌ర‌ణ‌లో దీక్షా దివ‌స్ ఏర్పాటు చేయ‌డంపై వివాదం ముసురుకుంటోంది. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ పైస‌ల‌తో నిర్మించిన దీక్షాదివ‌స్ పైలాన్‌లో కేసీఆర్ బొమ్మ పెట్టుండేంది..? అంటూ బీజేపీ నేత‌లు ప్రశ్నిస్తున్నారు. వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ‘దీక్షా దివస్‌’ పైలాన్‌ను ఆదివారం మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్కర్‌తో క‌ల‌సి ఆవిష్కరించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని స్మార్ట్‌ రోడ్డు పక్కన రూ.10 లక్షలతో పైలాన్‌ నిర్మించారు.

12 అడుగుల ఎత్తుండే దీని నాలుగు వైపులా తెలంగాణ ఉద్యమం గురించి తెలిపే చిత్రాలున్నాయి. తెలంగాణ లోగో అందులో కేసీఆర్‌ బొమ్మ, మరో వైపు తెలంగాణ పటంలో పిడికిలి, మరో వైపు ‘జై తెలంగాణ, జైజై తెలంగాణ’, ఇంకో వైపు దీక్షా దివస్‌ స్ఫూర్తి చిహ్నం నినాదాల‌ను ఏర్పాటు చేశారు. దీక్షా దివ‌స్ ఆవిష్కర‌ణోత్సవం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు తెలంగాణ గాంధీ అంటూ ఆకాశానికెత్తారు. ఈ విష‌యం అలా ఉంచితే పైలాన్‌లో కేసీఆర్ బొమ్మ పెట్టుండేంది..? అంటూ బీజేపీ నేత‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వ పైసలతోని, వరంగల్ కార్పొరేషన్‌లో సీఎం కేసీఆర్ భజన ఏంది..? అంటూ బీజేపీ వ‌రంగ‌ల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు ప‌ద్మ ఒక ప్రక‌ట‌న‌లో మండిప‌డ్డారు.

టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బానిస‌త్వానికి నిద‌ర్శనం : బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి

ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వ పైసలతోని, కార్పొరేషన్‌లో సీఎం కేసీఆర్ భజన ఏంది…? ఇక్కడ ఏమైనా కేసీఆర్ దీక్ష చేశాడా..? లేక ఉద్యమ సమయంలో కార్పొరేషన్‌కి వచ్చాడా..? పోనీ… దీనికి ఏమైనా నిధులు ఇచ్చాడా..? ఎందుకు.. కేసీఆర్ బొమ్మ పెట్టాల్సి వచ్చింది..? అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల‌ రాకేష్ రెడ్డి టీఆర్ఎస్ నేత‌ల‌పై ప్రశ్నల వ‌ర్షం కురిపించారు. ఆదివారం పైలాన్ ఆవిష్కర‌ణ అనంత‌రం ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. ఉద్యమం పేరు చెప్పుకొని ఓట్లు సీట్లు రాబట్టుకోవాలని మరోసారి సెంటిమెంట్ రగల్చాడనికే కొత్త నాట‌కం మొద‌లుపెట్టార‌ని అన్నారు.

ఒక్క కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ వచ్చినట్టు ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూడ‌టం అవివేక‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. దీక్షా దివస్ పేరిట కేసీఆర్ దృష్టిలో పడాలని, ఆయన భజనలో మునిగి తేలుతూ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేయ‌డం దారుణ‌మ‌ని కార్పోరేష‌న్ ప్రజాప్రతినిధుల తీరును ఆయ‌న‌ త‌ప్పుబ‌ట్టారు. ప్రజల సొమ్ముతో పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్టు కార్పొరేషన్‌లో కేసీఆర్ బొమ్మలు, శిలాఫ‌ల‌కాలు, పైలాన్‌ను ఆవిష్కరించడం మీ బానిసత్వ మనస్తత్వానికి అద్దం పడుతోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును సొంత డబ్బా కొట్టుకొడానికి ఖర్చు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed