కేటీఆర్ నీకు లెక్కలు కావాలా..? మీ నాన్నను అడుగు

by Shyam |
కేటీఆర్ నీకు లెక్కలు కావాలా..? మీ నాన్నను అడుగు
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించే నిధుల లెక్కలు తెలియకుంటే మీ నాన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు సూచించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ. 2 లక్షల కోట్ల పది రూపాయలు చెల్లిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేవలం లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే పన్నులనే కేంద్రానికి చెల్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సంస్థల నుంచి వచ్చే పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతున్నాయని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రం నుంచి వచ్చే నిధులను మించి కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో చేపడుతున్నామన్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, సర్వ శిక్షా అభియాన్, గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మంత్రిగారు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ మేమే చేస్తున్నామని చెప్పుకోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసే నిధులు లెక్కలు తెలియకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగి మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంకు భయపడి, మైనారిటీ ఓటర్లు ఎక్కడ దూరమవుతారో అన్న భయంతో నిర్వహించడం లేదని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను జరిపించి తీరుతామని స్పష్టంచేశారు. మరోవైపు దళిత బంధు తదితర హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఉపఎన్నికలు జరగాల్సిన హుజరాబాద్‌లో ఏ ఒక్కరికీ కూడా దళిత బంధు డబ్బులు వచ్చిన దాఖలాలు లేవన్నారు. తన రాజ్యాన్ని స్వతంత్ర భారత దేశంలో విలీనం చేసే సమయంలో నిజాం ప్రభువు అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు వంగి వంగి నమస్కారాలు చేసిన తీరున ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరాల కోసం ప్రధానమంత్రికి నమస్కారాలు చేస్తున్నారన్నారు. కేంద్రంతో పాటు 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలలో ఎక్కడ స్కాములు జరగలేదన్నారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని జితేందర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పటాకుల బాలరాజు, బీజేపీ సీనియర్ నాయకులు పడాకుల రామచంద్రయ్య, బురుజు రాజేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed